సిద్ధం కండి.. ఇంకో అల్లుడు వ‌స్తున్నాడు..!

అవును.. స‌ముద్రంలో చేప‌ల‌కు కొద‌వా.. ఇండ‌స్ట్రీలో వార‌సుల‌కు కొద‌వా..? ఒక్క‌రు వ‌స్తే చాలు ఆటోమేటిక్ గా అంద‌రూ వ‌చ్చేస్తారు. ఇప్ప‌టికే మ‌న ఇండ‌స్ట్రీ 80 శాతం వార‌సుల‌తో నిండిపోయింది. ఇప్పుడు ఈ కోవ‌లో మ‌రో హీరో కూడా వ‌స్తున్నాడు. పైగా ఇప్పుడు వార‌సుల‌ను ప‌రిచ‌యం చేయ‌డానికి ఓ నిర్మాత కూడా రెడీ అయ్యాడు. అత‌డే సాయి కొర్ర‌పాటి. ఈయ‌న‌కు అశ్వినీద‌త్ కు కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. వైజ‌యంతి బ్యాన‌ర్ కు 40 ఏళ్ల చ‌రిత్ర ఉంది. ద‌ర్శ‌కుల‌కు ఎంత డిమాండ్ ఉండేదో.. అశ్వినీద‌త్ కు కూడా అంతే ఇమేజ్ ఉండేది.

Vaishnav Tej Debut Movie

ఆయ‌న బ్యాన‌ర్ లో ప‌నిచేయ‌ని హీరో లేడు ఇండ‌స్ట్రీలో. ముఖ్యంగా అశ్వినీద‌త్ చేయి ప‌డితే ఏ వార‌సుడు అయినా స్టార్ అయిపోతాడు అనే సెంటిమెంట్ ఉంది. అందుకే ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోలు త‌మ సొంత బ్యానర్స్ ఉన్నా కూడా త‌మ వార‌సుల‌ను తీసుకెళ్లి అశ్వినీద‌త్ చేతిలో పెట్టారు. చిరంజీవి వార‌సుడు రామ్ చ‌ర‌ణ్ ను చిరుత‌తో.. కృష్ణ వార‌సుడు మ‌హేశ్ ను రాజ‌కుమారుడితో.. బ‌న్నీని గంగోత్రితో.. నారా రోహిత్ ను బాణం సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసాడు అశ్వినీద‌త్.
ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు. ఇలాంటి సెంటిమెంట్స్ ఇప్పుడు సాయికొర్ర‌పాటి తీసుకుంటున్నాడు. ఈయ‌న వార‌సుల‌ను ప‌రిచ‌యం చేసే కార్య‌క్ర‌మం పెట్టుకుంటున్నాడు.

ఇప్ప‌టికే మోక్ష‌జ్ఞను ప‌రిచ‌యం చేస్తాన‌ని చెప్పాడు సాయి కొర్ర‌పాటి. బాల‌య్య త‌న‌యుడు ఎప్పుడు హీరో అయినా తొలి సినిమా త‌న‌దే అంటున్నాడు ఈ నిర్మాత‌. ఈ మ‌ధ్యే మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ ను కూడా విజేత సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది ఈయ‌నే. అయితే ఈ సినిమా ఆడ‌లేదు అది త‌ర్వాతి విష‌యం. ఈయ‌న‌కు తోడు మెగా మేన‌ల్లుడు సాయిధ‌రంతేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ ను హీరోగా ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌ను కూడా ఈ నిర్మాతే తీసుకుంటున్నాని తెలుస్తుంది. సాగ‌ర్ కే చంద్ర ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తాడ‌నే వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. మొత్తానికి సాయికొర్ర‌పాటి ఇప్పుడు మ‌రో అశ్వినీద‌త్ లా మారిపోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here