మేన‌ల్లుడి బార్ ఓపెనింగ్ అయిపోయింది..

ఎవ‌రా మేన‌ల్లుడు.. ఏంటా బార్ ఓపెనింగ్ అనుకుంటున్నారా..? మ‌న ఇండ‌స్ట్రీలో సాయిధ‌ర‌మ్ తేజ్ ను ముద్దుగా మెగా మేన‌ల్లుడు అంటుంటారు. ఆయ‌న హిట్టు ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా కూడా క్రేజ్ మాత్రం అలాగే ఉంది. మార్కెట్ ప‌డిపోయిందేమో కానీ సినిమాలు మాత్రం చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈయ‌న కొత్త సినిమా చిత్ర‌ల‌హ‌రి.. బార్ అండ్ రెస్టారెంట్ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. ఇండ‌స్ట్రీలో జాత‌కం మార‌డానికి ఏళ్ల‌తో ప‌నిలేదు.. వేళ్ల‌మీద లెక్క పెట్టేంత స‌మ‌యం చాలు. సాయిధ‌రంతేజ్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది.

Sai Dharam Tej Chitralahari Shooting Begins

ఈయ‌న ఇండ‌స్ట్రీకి తారాజువ్వ‌లా వ‌చ్చాడు. కానీ ఇప్పుడు పేల‌ని ఒత్తులా మిగిలాడు. ఒక‌టి రెండు కాదు.. వ‌ర‌స‌గా ఆరు ఫ్లాపుల‌తో సాయిధ‌రంతేజ్ ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయాడు. వైకుంఠ‌పాళిలో ఆడటం తెలియ‌క నిచ్చెన నుంచి జారి ప‌డుతున్నాడు ఈ కుర్ర హీరో.

విన్న‌ర్ నుంచి మ‌నోడి టైమ్ ట‌ర్న్ అయింది. దాని దెబ్బ నుంచి కోలుకోక ముందే న‌క్ష‌త్రం రూపంలో అన‌కొండ వ‌చ్చి మింగేసింది. అయ్యోరామా అనుకుంటున్న టైమ్ లో మందు రాస్తుందేమో అనుకున్న జ‌వాన్ అనే మ‌రో పాము వెన‌క నుంచి వ‌చ్చి కాటేసింది. ఇన్ని కాట్లు ప‌డిన త‌ర్వాత కూడా ఇంకా నిచ్చెన వ‌స్తుంద‌నే ఆశ‌తోనే ఉన్నాడు సాయిధ‌రంతేజ్. అలాంటి టైమ్ లో వ‌చ్చిన ఇంటిలిజెంట్ అన్నింటికంటే పెద్ద కాటేసింది. దెబ్బ‌కు టాప్ కి వెళ్లిపోదాం అనుకున్న సాయికి ఈ చిత్రం కింది నుంచి టాప్ కు తీసుకెళ్లింది. త‌న కెరీర్ ను పూర్తిగా మింగేయ‌డానికి వ‌చ్చిన అతిపెద్ద పురాత‌న అన‌కొండ ఇదే అని గ్ర‌హించలేకేపోయాడు మెగా మేన‌ల్లుడు.

ఈ కాటు దెబ్బ‌కు సాయి ఇప్ప‌ట్లో లేచేలా కూడా క‌నిపించ‌ట్లేదు. అంత దారుణమైన కాటు ప‌డింది. తేజ్ ఐ ల‌వ్ యూ కూడా క‌నీసం 5 కోట్ల మార్క్ కూడా అందుకోవ‌డం లేదంటే సాయి ప‌రిస్థితి ఎలా ఉందో అర్థ‌మ‌వుతుంది. దాంతో ఇప్పుడు బ్రాండ్ కాదు.. క‌థ ముఖ్యం అని లుక్ కూడా మార్చేసి చిత్ర‌ల‌హ‌రి చేస్తున్నాడు. కిషోర్ తిరుమ‌ల లాంటి కంటెంట్ ఉన్న ద‌ర్శ‌కుడితో క‌లిసి ప‌ని చేస్తున్నాడు సాయి. దీనికి చిరంజీవి సాయం కూడా ఉంది. చిత్ర‌ల‌హ‌రి సినిమా క‌చ్చితంగా త‌న కెరీర్ ను నిల‌బెడుతుంద‌ని న‌మ్ముతున్నాడు సాయి. ఇందులో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్ర‌ల‌హ‌రి సాయి కెరీర్ కు ఎంత‌వ‌ర‌కు యూజ్ అవుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here