సెల‌వంటూ వెళ్లిపోయిన సీత‌య్య‌.

8 నెల‌లు.. కొన్ని వేల కిలోమీట‌ర్లు.. తండ్రి కోసం రేయింబ‌వ‌ళ్లు క‌ష్టం.. సొంత కుటుంబానికి దూరంగా త్యాగం.. అన్నీ తండ్రే అంటూ అంద‌ర్నీ దూరం చేసుకోవడం.. ఇవ‌న్నీ హ‌రికృష్ణ సాధించిన విజ‌యాలే. పైకి క‌ఠువుగా క‌నిపించినా లోప‌ల మాత్రం ఆయ‌న చిన్న‌పిల్లోడే. ఆయ‌న‌తో సాన్నిహిత్యం ఉన్న వాళ్లు చెప్పే మాట ఇది. ఇప్పుడు ఈ చిన్న‌పిల్లోడు లేడు.. మారాం చేస్తూ దేవుడి ద‌గ్గ‌రికి వెళ్లిపోయాడు. నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణం ఇప్పుడు ఇండ‌స్ట్రీతో పాటు రాజ‌కీయ వ‌ర్గాల‌ను కూడా షాక్ లో ప‌డేసింది. ఇన్నాళ్లూ త‌మ‌కు అండ‌గా ఉన్న తండ్రి ఇలా రోడ్డు ప్ర‌మాదంలో నిర్జీవంగా ప‌డి ఉండ‌టం చూసి ఆయ‌న త‌న‌యులు ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ జీర్ణించుకోలేక‌పోతున్నారు.

nandamuri harikrishna dead in accident 1

హాస్పిట‌ల్ కు వ‌చ్చి చిన్న పిల్ల‌ల్లా ఏడుస్తున్నారు. సెప్టెంబ‌ర్ 2న 62వ వ‌డిలోకి అడుగు పెట్ట‌నున్న ఆయ‌న‌.. మూడు రోజుల ముందే ఇలా క‌న్నుమూయ‌డం అంద‌రితోనూ కంట‌త‌డి పెట్టిస్తుంది. 1956, సెప్టెంబ‌ర్ 2న కృష్ణా జిల్లా నిమ్మకూరులో నంద‌మూరి తార‌క‌రామారావు, బ‌స‌వ‌తార‌కం దంప‌తుల‌కు నాలుగో సంతానంగా జన్మించారు హ‌రికృష్ణ‌. చిన్న‌నాటి నుంచే తండ్రి గురువుగా పెరిగారు ఈయ‌న‌. 1967లో 11 ఏళ్ల వ‌య‌సులో శ్రీకృష్ణావతారం సినిమాతో ఎన్టీఆర్ న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు హ‌రికృష్ణ‌. ఆ త‌ర్వాత కూడా కొన్ని సినిమాలు చేసారు కానీ పెద్ద‌గా నిల‌బ‌డ‌లేదు.

తల్లా పెళ్లామా.. రామ్‌ రహీమ్‌.. దానవీరశూరకర్ణ లాంటి సినిమాల్లో చిన్న పాత్ర‌ల్లో న‌టించారు. తండ్రి రాజ‌కీయాల కార‌ణంగా కొన్నేళ్ల పాటు ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్నారు హ‌రికృష్ణ‌. శ్రీరాములయ్యతో ఆయ‌న సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లైంది. అప్ప‌ట్నుంచి కొన్నేళ్ల పాటు సంచ‌ల‌నాలు సృష్టించారు హ‌రికృష్ణ‌. ముఖ్యంగా 1998లో వ‌చ్చిన శ్రీ‌రాముల‌య్య‌లో కామ్రేడ్ స‌త్యం పాత్ర‌కు జీవం పోసారు. వైవిఎస్ చౌద‌రి ఈయ‌న్ని బాగా వాడుకున్నాడు.

సీతారామ‌రాజు.. లాహిరి లాహిరి లాహిరిలో.. సీత‌య్య చిత్రాలతో హ‌రికృష్ణ ఇమేజ్ రెండింత‌లు చేసాడు చౌద‌రి. టైగ‌ర్ హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్.. స్వామి.. శివ‌రామ‌రాజు.. శ్రావ‌ణ‌మాసం లాంటి సినిమాలు కూడా ఈయ‌న‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. న‌టించింది త‌క్కువ సినిమాలే కావ‌చ్చు కానీ హ‌రికృష్ణ న‌టుడిగా ఇండ‌స్ట్రీపై చెర‌గ‌ని ముద్ర వేసారు. తండ్రి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌పుడు ఆయ‌న కోసం త‌న జీవితాన్ని త్యాగం చేసాడు హ‌రికృష్ణ‌. చైత‌న్య‌ర‌థ‌సార‌థిగా త‌న‌కంటూ ఓ జీవితం ఉంద‌నే విష‌యాన్ని మ‌రిచిపోయాడు. తండ్రి చ‌నిపోయాక రాజ‌కీయాల్లో కూడా కొన్నాళ్లు యాక్టివ్ గానే ఉన్నారు.

ముఖ్యంగా చంద్ర‌బాబుతో విభేధాలు వ‌చ్చిన త‌ర్వాత అన్న తెలుగుదేశం పెట్ట‌డం.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ దాన్ని మూసేయ‌డం ఇవ‌న్నీ హ‌రికృష్ణ రాజ‌కీయ జీవితంలో కీల‌క ఘ‌ట్టాలు. రాజ‌కీయ జీవితంలో కొన్నాళ్లు రాజ్యసభ సభ్యుడి.. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు హ‌యాంలో రవాణాశాఖా మంత్రిగా ప‌ని చేసారు. ప్ర‌స్తుతం తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నా రాజ‌కీయాల‌కు దూరంగానే ఉన్నారు. కొన్నేళ్లుగా కేవ‌లం త‌న పిల్ల‌లతో హాయిగా ఉంటున్నారు హ‌రికృష్ణ‌. పార్టీ మీటింగుల‌కు కూడా రావ‌డం లేదు. ఇప్పుడు కూడా త‌న అభిమాని కొడుకు పెళ్లికి వెళ్తూ యాక్సిడెంట్ లో క‌న్నుమూసారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుందాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here