రివ్యూ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌

రివ్యూ        : అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌
న‌టీన‌టులు  : ఎన్టీఆర్, పూజాహెగ్డే, ఇషారెబ్బా,సునీల్, జ‌గ‌ప‌తిబాబు, నాగ‌బాబు, న‌వీన్ చంద్ర‌ త‌దిత‌రులు
సంగీతం      : ఎస్ఎస్ థ‌మ‌న్
ఎడిట‌ర్       : న‌వీన్ నూలి
సినిమాటోగ్ర‌ఫీ: పిఎస్ వినోద్
నిర్మాత‌      : రాధాకృష్ణ
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: త‌్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్

అర‌వింద స‌మేత కోసం ఎన్టీఆర్ అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ కూడా చూస్తుంది. ఎందుకంటే త‌న జీవితంలో అంత పెద్ద విషాదం జ‌రిగిన త‌ర్వాత కూడా నిర్మాత‌కు న‌ష్టం క‌ల‌గ‌కూడ‌ద‌ని ఎన్టీఆర్ షూటింగ్ కు వ‌చ్చాడు క‌దా.. అందుకు ఈ సినిమాపై అంద‌రికీ ఆస‌క్తి పెరిగిపోయింది. దానికితోడు అజ్ఞాత‌వాసి మ‌రిపించ‌డానికి త్రివిక్ర‌మ్ చేసిన మ‌రో ప్ర‌య‌త్నం ఇది.. మ‌రి ఇది ఎలా ఉంది..?

క‌థ‌:
వీర‌రాఘ‌వ‌రెడ్డి(ఎన్టీఆర్) రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్ట్ కుటుంబం నుంచి వ‌చ్చిన‌వాడు. లండ‌న్ లో చ‌దువుకుని ఊరికి వ‌స్తాడు. అప్ప‌టికే బ‌సిరెడ్డి(జ‌గ‌ప‌తిబాబు), వీర‌రాఘ‌వ‌రెడ్డి తండ్రి నారపురెడ్డి(నాగ‌బాబు) ఊళ్లు కొట్టుకుంటుంటాయి. ఆ ప‌గ‌ల‌తోనే రాఘ‌వ‌కు ఊళ్లోకి స్వాగ‌తం ప‌లుకుతారు. ఆ గొడ‌వ‌ల్లో తండ్రిని కోల్పోతాడు రాఘ‌వ‌రెడ్డి. ఆ త‌ర్వాత గొడ‌వ‌లు ఆపి శాంతి కోసం ఊరు నుంచి వెళ్లిపోతాడు. ఆ ప్ర‌యాణంలో అర‌వింద‌(పూజాహెగ్డే)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆమె సాయంతో గొడ‌వ‌లు ఎలా ఆపాడ‌న్న‌ది క‌థ‌.

క‌థ‌నం:
త్రివిక్ర‌మ్ సినిమా అంటే ముందుగా అంద‌రూ ఊహించేది డైలాగ్స్. ఆ త‌ర్వాత కామెడీ.. ఆ త‌ర్వాతే మిగిలిన‌వి. కానీ అజ్ఞాతవాసిలో ఇందులో ఏ ఒక్క‌టి కూడా అంద‌లేదు. అందుకే దారుణంగా నిరాశ ప‌డ్డారు అభిమానులు. ఆ చేదు జ్ఞాప‌కం మ‌రిపించ‌డానికి ఇప్పుడు అరవింద స‌మేత‌తో వ‌చ్చేసాడు త్రివిక్ర‌మ్. యుద్ధం చేసే స‌త్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హ‌త లేదు. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే ఇదే అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ కథ‌. తెలుగు సినిమాకు సీమ ప‌గ‌లు.. ప్యాక్ష‌న్ గొడ‌వ‌లు రెండూ కొత్త కాదు. వాటితోనే విజ‌యాలు.. వాటితోనే విమ‌ర్శ‌లు కూడా అందుకున్నారు. ఇప్పుడు త్రివిక్ర‌మ్ కూడా మ‌రోసారి సీమ క‌థ‌నే తీసుకొచ్చాడు.. కాక‌పోతే త‌న స్టైల్ ఆఫ్ ట్రీట్ మెంట్ ఇచ్చాడు.

అర‌వింద స‌మేత కొత్త క‌థేం కాదు.. అలాగ‌ని మ‌రీ తీసిపారేసేంత క‌థ కూడా కాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్యాక్ష‌న్ సినిమాల‌న్నీ యుద్ధం ముగిసేంత‌వ‌ర‌కు చూపించారు. అక్క‌డ్నుంచే త‌న క‌థ‌ను మొద‌లుపెట్టాడు మాటల మాంత్రికుడు. సినిమా మొద‌ట్లోనే ఆకాశ‌మంత ఎత్తుకు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు.. తొలి 20 నిమిషాలు అభిమానుల‌కు పూన‌కాలు తెప్పించాడు. నార్మ‌ల్ ఆడియ‌న్స్ కు కూడా ఎన్టీఆర్ అలా తెర‌పై రెచ్చిపోతుంటే కన్నుల పండ‌గే. ఒక్క సారి ఆ ఇంట్రో చూసిన త‌ర్వాత అదే టెంపో ఊహించుకుంటాం కానీ.. ఫ‌స్టాఫ్ లో అది చాలా చోట్ల మిస్ అయిన ఫీలింగ్ వ‌చ్చేసింది. పూజాహెగ్డే సీన్స్ కొన్ని ఆక‌ట్టుకోలేదు.. సునీల్ నుంచి కామెడీ ఊహించుకోవ‌డం అత్యాశే. ఆయ‌న ఈ చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు కానీ ఎన్టీఆర్ చెప్పిన‌ట్లు క‌మెడియ‌న్ కాదు.. ప్రీ ఇంట‌ర్వెల్ వ‌ర‌కు కూడా అలా అలా సాగిన క‌థ‌.. ఇంట‌ర్వెల్ లో మ‌ళ్లీ ఊపందుకుంది.

మ‌రో యాక్ష‌న్ సీక్వెన్స్ తో త్రివిక్ర‌మ్ త‌న మార్క్ చూపించాడు. ఇక సెకండాఫ్ అంతా ఎమోష‌న‌ల్ డ్రామాగా న‌డిపించాడు మాట‌ల మాంత్రికుడు. మ‌ధ్య‌లో కాంప్ర‌మైజ్ సీన్ బాగా వ‌ర్క‌వుట్ అయింది.. అయితే ఎమోష‌న్ లో ప‌డి క‌థ కాస్త సాగింది.. త్రివిక్ర‌మ్ నుంచి ఏమేం ఆశిస్తామో అన్నీ ఇవ్వ‌లేదు కానీ చాలా వ‌ర‌కు మ‌సాలాలు ద‌ట్టించాడు. వినే టైమ్.. చెప్పే మ‌నిషి వ‌ల్ల విష‌యం విలువ మారిపోతుంద‌న్నాడు త్రివిక్ర‌మ్. కానీ నిజంగానే ఇప్పుడు ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు ఇంత‌గా ఉన్నాయా.. ఇదే ప్రేక్షుక‌ల అనుమానం కూడా. ఓవ‌రాల్ గా అర‌వింద స‌మేత.. ఫ్యాన్స్ కు పూన‌కాలు.. నార్మ‌ల్ ఆడియ‌న్స్ కు ఓకే..

న‌టీన‌టులు:
ఎన్టీఆర్ న‌ట‌న ఎప్ప‌ట్లాగే అదిరిపోయింది. ఆయ‌న మ‌రోసారి త‌న పాత్ర‌కు ప్రాణం పోసాడు. త్రివిక్ర‌మ్ ఈ పాత్ర‌ను ఎలా అయితే డిజైన్ చేసాడో అంత‌కు ప‌దిరెట్లు ఎక్కువే స్క్రీన్ పై ప్ర‌జెంట్ చేసాడు యంగ్ టైగ‌ర్. ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ గా రెచ్చిపోయాడు. పూజాహెగ్డే కూడా బాగా న‌టించింది. ఈమె పాత్ర కూడా సినిమాకు కీల‌క‌మే. పాట‌ల కోసం అన్న‌ట్లు కాకుండా క‌థ కోసం అన్న‌ట్లుంది పూజా. సొంత డ‌బ్బింగ్ తో అల‌రించింది. పూజా చెల్లిగా ఇషారెబ్బా ప‌ర్లేదు. చాలా ఏళ్ళ త‌ర్వాత సునీల్ త‌న మార్క్ తో అల‌రించాడు. ఇక విల‌న్ గా జ‌గ‌ప‌తిబాబు ర‌ప్ఫాడించాడు. ఆయ‌న రాను రాను బ్యాడ్ బాయ్ ఆఫ్ టాలీవుడ్ అయిపోతున్నాడు. నాగ‌బాబు, న‌వీన్ చంద్ర, సుప్రియ ప‌గ‌త్ లాంటి వాళ్లు బాగా న‌టించారు.

టెక్నిక‌ల్ టీం:
థ‌మ‌న్ పాట‌లు సినిమాకు మైన‌స్. ఆడియో ప‌రంగా ఆక‌ట్టుకోలేదు కానీ స్క్రీన్ పై విజువ‌ల్ గా మాత్రం బాగున్నాయి. అన‌గ‌న‌గా అయితే అదిరిపోయింది. త‌న డాన్సుల‌తో ర‌ప్ఫాడించాడు ఎన్టీఆర్. రెడ్డి ఇక్క‌డ సూడు కూడా అంతే. సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. పిఎస్ వినోద్ త‌న ప‌ని ప‌ర్ఫెక్ట్ గా చేసాడు. న‌వీన్ నూలి ఎడిటింగ్ ప‌ర్లేదు. మూడు గంట‌ల‌కు చేరువ‌గా రావ‌డం కాస్త మైన‌స్. అక్క‌డ‌క్క‌డా స్లో అయింది. నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి. త్రివిక్ర‌మ్ అజ్ఞాత‌వాసిలో మిస్ అయిన మ‌సాలాల‌న్నీ ఇక్క‌డ లెక్కేసుకుని మ‌రీ తీసుకొచ్చాడు. రొటీన్ క‌థ‌తోనే వ‌చ్చినా ఎంగేజింగ్ గా చెప్ప‌డంలో బాగానే స‌క్సెస్ అయ్యాడు. దానికి ఎన్టీఆర్ కూడా స‌పోర్ట్ చేసాడు.

చివ‌ర‌గా:
అర‌వింద స‌మేత‌.. త్రివిక్ర‌మ్ మార్క్ ఫ్యాక్ష‌న్ డ్రామా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *