రివ్యూ: హుషారు

రివ్యూ         : హుషారు
న‌టీన‌టులు    : తేజూస్, తేజ్ కుర‌పాటి, దినేష్ తేజ్, ద‌క్ష‌, ప్రియా వ‌డ్ల‌మాని, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు
సంగీతం        : రాధ‌న్
ఎడిట‌ర్         : విజ‌య్ వ‌ర్ధ‌న్ కావూరి
సినిమాటోగ్ర‌ఫీ  : రాజ్ తోట‌
నిర్మాత‌        : బెక్కం వేణుగోపాల్
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: శ్రీ‌హ‌ర్ష కొనుగంటి

 

హుషారు.. ఈ మ‌ధ్య కాలంలో బాగానే వినిపించిన పేరు ఇది. ప‌క్కా కుర్రాళ్ల కోసం అని ట్రైల‌ర్ చూస్తుంటేనే సినిమా అర్థ‌మైపోతుంది. కాస్త క్రేజీ కాన్సెప్ట్ తోనే వ‌చ్చిన ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింద‌నేది చూద్దాం..

క‌థ‌:
ధృవ్, చేయ్, బంటి, తేజ్ న‌లుగురు ఫ్రెండ్స్. స్కూల్ ఏజ్ నుంచే స్నేహితులు. ప్ర‌తీ క‌ష్టాన్ని.. సుఖాన్ని క‌లిసే పంచుకుంటారు. జీవితం అంటే ఎంజాయ్ చేయ‌డ‌మే కానీ బాధ ప‌డ‌టానికి కాదు.. జ్ఞాప‌కాలు మిగిలిపోతాయి అని చెప్తుంటారు. అలాగే లైఫ్ లీడ్ చేస్తుంటారు కూడా. అలాంటి స‌మ‌యంలో చై జీవితంలోకి ఓ అమ్మాయి వ‌స్తుంది. మోసం చేసి వెళ్లిపోతుంది. అప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. హాస్పిట‌ల్ కు తీసుకెళ్తే కాన్స‌ర్ అని తేలుతుంది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న జీవితం అంతా ఒక్క‌సారిగా త‌ల‌కిందులు అవుతుంది. అయినా కూడా స్నేహితుడి కోసం నిల‌బ‌డ‌తారు. అప్పుడే వాళ్ల జీవితంలోకి రాహుల్ వ‌స్తాడు. అక్క‌డ్నుంచి బీర్ ఫ్యాక్ట‌రీ.. వాళ్ల జింద‌గీ మారిపోతుంది. ఆ త‌ర్వాత ఏమైంది అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
న‌లుగురు కుర్రాళ్లు.. వాళ్ల స్నేహం.. అప్పుడే అయిపోయిన చ‌దువులు.. ఏం చేయాలో తెలియ‌క రోడ్ల‌పై తిరుగుళ్లు.. చేతిలో బీర్లు.. ఇంట్లో చివాట్లు.. ఇదంతా చూస్తుంటే హ్యాపీడేస్, కేరింత‌, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫుల్లుగా గుర్తొస్తాయి. హుషారు కూడా ఈ త‌ర‌హా సినిమానే.. కాక‌పోతే ఇంకాస్త బోల్డ్ అటెంప్ట్ అంతే. ద‌ర్శ‌కుడు శ్రీ‌హ‌ర్ష కొన‌గంటి తాను రాసుకున్న క‌థ‌ను పూర్తిగా కుర్రాళ్ల‌కు అంకిత‌మిచ్చేసాడు. అలాగే కుర్రాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని చూపించాడు. పెద్దలు తమ నిర్ణయాన్ని పిల్లలపై రుద్దడం కరెక్ట్ కాదు.. వాళ్ళకి నచ్చింది చేయడమే జీవితం అనే సందేశం ఇచ్చాడు దర్శకుడు.

20 ఏళ్ల‌లో చేసే ప్ర‌తీ ప‌ని క్రేజీగానే ఉంటుంది.. ఈ సినిమాలోనూ అదే చూపించాడు ద‌ర్శ‌కుడు. దొంగ చాటుగా సిగరెట్లు.. మందు.. అమ్మాయిల కోసం చూడటం.. పోర్న్ చూడటం.. ఇలా ఏ ఒక్కటి దాచిపెట్టలేదు దర్శకుడు. అప్పుడే బిటెక్ చేసి.. బ్యాక్ లాక్స్ ఉండి.. జాబులు లేక‌.. గాళ్ ఫ్రెండ్స్ బీర్లు అంటూ.. అదే జీవితం అనుకుని ఎంజాయ్ చేయ‌డం అన్నీ చూపించాడు. జీవితం అంటే ఏంటో కూడా తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉండే కుర్ర‌త‌నాన్ని తెర‌పై ఆవిష్క‌రించాడు.

అదే స‌మ‌యంలో చ‌చ్చేవ‌రకు స్నేహం విడిపోకూడ‌దు అనే ఎమోష‌న్స్ కూడా చూపించాడు. క్రేజీ థింగ్స్ అంటూ అప్పుడ‌ప్పుడూ హ‌ద్దులు కూడా దాటేసాడు ద‌ర్శ‌కుడు.. ఫ‌స్టాఫ్ లో అయితే ముద్దుల వ‌ర్షం కురిసింది.. దాంతోపాటే అక్క‌డ‌క్క‌డా కామెడీ కూడా పేలింది. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో అడ‌ల్ట్ షార్ట్ ఫిల్మ్ కామెడీ బాగా పేలింది.. కాక‌పోతే కండీష‌న్స్ అప్లై. క‌థ సింక్ లో వెళ్ల‌క‌పోవ‌డం.. ఎక్క‌డిక‌క్క‌డ సీన్స్ క‌ట్ చేసి అతికించిన‌ట్లు ఉండ‌టం మైన‌స్.

చిన్న ట్విస్ట్ తో ఇంట‌ర్వెల్ ఇచ్చి.. త‌ర్వాత బీర్ త‌యారీతో ఆస‌క్తి పుట్టించాడు. సెకండాఫ్ లో రాహుల్ రామ‌కృష్ణ వ‌చ్చిన త‌ర్వాత కామెడీ బాగానే ఉంది. సాఫ్ట్ వేర్ క‌ష్టాల‌ను కామెడీగా చూపించాడు ద‌ర్శ‌కుడు.. ఆ సీన్స్ లో రాహుల్ న‌వ్వించాడు. ఎమోష‌న్స్ అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు.. క్రేజీ పేరుతో అడ‌ల్ట్ జోక్స్ పేలాయి. క్లైమాక్స్ లో అన్ని సినిమాల మాదిరే జింగ‌దీ నా మిలేగీ దొబారా.. నీకు న‌చ్చిందే చేసేయ్ రా సోద‌రా అనేసాడు దర్శకుడు. ఓవ‌రాల్ గా ఈ హుషారు.. కొంచెం జోరు విత్ చల్లటి బీరు.. అలాగే కొంచెం బోరు.

న‌టీన‌టులు:
అంతా కొత్త కుర్రాళ్లే న‌టించారు. బాగా న‌టించారు అంద‌రూ. ముఖ్యంగా ఒక్క‌ర్ని త‌క్కువ‌.. ఒక‌ర్ని ఎక్కువ అని చూపించ‌కుండా అంద‌రికీ సేమ్ కారెక్ట‌ర్స్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. అంద‌ర్నీ బాగానే బ్యాలెన్స్ చేసాడు. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ వైజ్ గా చై కారెక్ట‌ర్ బాగుంది. బంటి న‌వ్వించాడు. మిగిలిన ఇద్ద‌రూ కూడా బాగున్నారు. హీరోయిన్ల‌లో ప్రియా వ‌డ్ల‌మాని అందాల అరాచ‌కం చేసింది. లిప్ లాక్స్ కూడా ఇచ్చింది. ద‌క్ష ప‌ర్లేదు. ఉన్నంత‌లో బాగానే చేసింది. మిగిలిన వాళ్లు కూడా కొత్త వాళ్లే. రాహుల్ రామ‌కృష్ణ ఈ చిత్రానికి పెద్ద‌దిక్క‌య్యాడు. ఆయ‌న సినిమాకు బ‌లం. కామెడీ కూడా.

టెక్నిక‌ల్ టీం:
రాధ‌న్ సంగీతం బాగుంది. అర్జున్ రెడ్డి త‌ర్వాత మ‌రోసారి ఆక‌ట్టుకున్నాడు. ముఖ్యంగా ఉండిపోరాదే సాంగ్ చాలా బాగుంది. ఆర్ఆర్ కూడా బానే వ‌ర్క‌వుట్ అయింది. సినిమాటోగ్ర‌ఫ‌ర్ రాజ్ తోట ప‌ని తీరు బాగుంది. విజ‌య్ వ‌ర్ధ‌న్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. తొలి సినిమా అయినా కూడా ఎక్క‌డా త‌డ‌బాటు క‌నిపించ‌లేదు. ద‌ర్శ‌కుడు హ‌ర్ష హుషారు క‌థ‌ను యూత్ ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాడు. అదే తెర‌కెక్కించాడు కూడా. మారిన సెన్సార్ రూల్స్ మ‌నోడికి హెల్ప్ చేసాయి కూడా. క‌థ‌ను కాస్త బోల్డ్ గా చెప్పాడు. చివ‌రికి లైఫ్ అనేది ఉన్న‌ది ఎంజాయ్ చేయ‌డానికి కానీ బాధ ప‌డ‌టానికి కాదు అని చూపించాడు ద‌ర్శ‌కుడు.

చివ‌ర‌గా:
హుషారు.. బీర్ ఎక్కువే పొంగింది.. కానీ కిక్కే త‌క్కువ‌గా ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *