రివ్యూ: న‌ర్త‌న‌శాల‌

రివ్యూ: న‌ర్త‌న‌శాల‌
న‌టీన‌టులు: నాగ‌శౌర్య, కాష్మీర్ ప‌ర్దేశీ, యామిని భాస్క‌ర్, అజ‌య్, శివాజీరాజా, గుండు సుద‌ర్శ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి త‌దిత‌రులు
సంగీతం: మ‌హ‌త్ సాగ‌ర్
సినిమాటోగ్ర‌ఫీ: సాయిశ్రీ‌రామ్
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: శ్రీ‌నివాస్ చ‌క్ర‌వ‌ర్తి
నిర్మాణ సంస్థ‌: ఐరా క్రియేష‌న్స్
నిర్మాత‌: ఉషా మ‌ల్పూరి

ఛ‌లో లాంటి సంచ‌ల‌న విజ‌యంతో క్రేజ్ పెంచుకున్నాడు నాగ‌శౌర్య‌. అది కూడా సొంత బ్యాన‌ర్ లో చేసాడు. ఇప్పుడు అదే బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన సినిమా కావ‌డంతో న‌ర్త‌న‌శాల‌పై ముందు నుంచి అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. మ‌రి వీటిని సినిమా ఎంత‌వ‌ర‌కు నిల‌బెట్టుకుంది..?

క‌థ‌:
క‌ళామందిర్ క‌ళ్యాణ్ (శివాజీరాజా) కు త‌న అమ్మే మ‌ళ్లీ త‌న‌కు పుట్టాల‌ని ఆశ ప‌డుతుంటాడు. అదే త‌న తండ్రి కోరిక కూడా. కానీ అనుకోకుండా కొడుకు (నాగ‌శౌర్య‌) పుట్టేస్తాడు. చిన్న‌నాటి నుంచి తాత కోసం అబ్బాయిని అమ్మాయిలా పెంచుతాడు. పెద్ద‌య్యాక అమ్మాయిల‌కు అండ‌గా నిల‌బ‌డి వాళ్ల కోసం ఓ క‌రాటే సెంట‌ర్ ఓపెన్ చేస్తాడు శౌర్య‌. ఎక్క‌డ అమ్మాయికి క‌ష్టం వ‌చ్చినా వెళ్లి తీర్చేస్తుంటాడు. అలా శౌర్య జీవితంలోకి మానస (కాష్మీర్ ప‌ర్దేశీ) ఓ క‌ష్టంతో వ‌చ్చి.. అది తీరిపోయిన త‌ర్వాత ఇష్ట‌ప‌డుతుంది. ఈయ‌న కూడా ప్రేమిస్తాడు. కానీ అదే స‌మ‌యంలో స‌త్య (యామిని భాస్క‌ర్) కూడా శౌర్య‌ను ఇష్ట‌ప‌డుతుంది. ఆమె నుంచి త‌ప్పించుకోడానికి గే అని అబ‌ద్ధం చెప్తాడు హీరో. అప్పుడు ఏం జ‌రిగింది.. ఎలా ఆ ప‌రిస్థితుల నుంచి హీరో బ‌య‌ట‌ప‌డ్డాడు అనేది అస‌లు క‌థ‌.

క‌థ‌నం:
లెజెండ‌రీ టైటిల్స్ వాడుకుంటున్న‌పుడు భ‌యం ఉంటుంది.. ఆ భ‌యం కంటే ఎక్కువ‌గా బాధ్య‌త ఉంటుంది. అది రిస్క్ అని తెలిసి కూడా నర్త‌న‌శాల టైటిల్ తీసుకున్నాడు నాగ‌శౌర్య‌. టైటిల్ ఇది అని చెప్పిన‌పుడు.. అంద‌రికీ కాన్సెప్ట్ అర్థ‌మైపోయుంటుంది. పైగా ఛ‌లో త‌ర్వాత సొంత బ్యాన‌ర్ లో చేస్తున్న సినిమా క‌దా.. అదే స్థాయిలో ఉంటుంద‌నే అంచ‌నాలు కూడా ఉంటాయి. నాగ‌శౌర్య కూడా పాయింట్ కొత్త‌గా ఉంద‌ని.. ద‌ర్శ‌కున్ని న‌మ్మి వెంట‌నే ఓకే చేసిన‌ట్లున్నాడు. కానీ నాగ‌శౌర్య పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస చ‌క్ర‌వ‌ర్తి నిల‌బెట్టుకోలేకపోయాడేమో అనిపించింది. గే కాన్సెప్ట్ తెలుగు ఇండ‌స్ట్రీకి కొత్త‌ది.. కానీ ఇదొక్క‌టి ప‌ట్టుకుని క‌థ న‌డిపిస్తే చాల‌నుకున్నాడు ద‌ర్శ‌కుడు. కొత్త పాయింట్ తీసుకున్న‌పుడు స్క్రీన్ ప్లే కూడా ఆస‌క్తిక‌రంగా ఉండుంటే బాగుండేది. హీరో గే అనే ఒక్క పాయింట్ తోనే సినిమా అంతా న‌డిపిస్తే స‌రిపోదు క‌దా.. కానీ న‌ర్త‌న‌శాల‌లో జ‌రిగింది ఇదే.. కొత్త పాయింట్ ను రొటీన్ స్క్రీన్ ప్లే తేల్చేసిన‌ట్లు అనిపించింది.
ఫ‌స్టాఫ్ లో శివాజీరాజా.. సెకండాఫ్ లో జ‌యప్ర‌కాశ్ రెడ్డి ఉండ‌టంతో.. అక్క‌డ‌క్క‌డా కామెడీ బాగానే వ‌ర్క‌వుట్ అయింది కానీ.. ఓవ‌రాల్ గా చూస్తే ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది. నాగ‌శౌర్య అయితే ద‌ర్శ‌కున్ని పూర్తిగా న‌మ్మేసాడ‌ని సినిమా చూస్తే తెలిసిపోతుంది. కొత్త ద‌ర్శ‌కులు వ‌చ్చిన‌పుడే కొత్త ఐడియాలు కూడా వ‌స్తుంటాయి.. కానీ త‌న‌కు వ‌చ్చిన ఐడియాను తెర‌పై శ్రీ‌నివాస్ కొత్త‌గా చూపించుంటే ఇంకా బాగుండేది. న‌ర్త‌న‌శాల‌లో ఆ కొత్త‌ద‌నం మిస్ అయిన ఫీలింగ్ క‌నిపించింది. ముఖ్యంగా ఛ‌లో త‌ర్వాత వ‌చ్చిన సినిమా కావ‌డ‌మే దీనికి వ‌రం.. శాపం.. రెండూనూ..! ఈ కాస్త కామెడీతోనే న‌ర్త‌న‌శాల వ‌ర్క‌వుట్ అవుతుందా అనేది ఆస‌క్తిక‌ర‌మే. చివ‌ర‌గా ఇందులో న‌టించిన జయ‌ప్ర‌కాశ్ రెడ్డి యాస‌లో చెప్పాలంటే.. నాగ‌శౌర్య పెద్ద పొత్రం(సినిమాలో దీనికి అర్థం చెప్పారులెండి) సినిమా తీసినాడ‌బ్బీ.. ఇది క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు అయితే స‌రిపోదనే అనిపిస్తుంది.

 

న‌టీన‌టులు:
నాగ‌శౌర్య గే గా కొత్త పాత్ర ట్రై చేసాడు. కొత్త‌ద‌నం కోసం చూడ‌టం అభినంద‌నీయ‌మే. కానీ క‌థ‌తో పాటు క‌థ‌న కూడా కొత్త‌గా ఉండుంటే ఇంకా బాగుండేదేమో..? ఇది ప‌ట్టించుకోలేదు హీరో. ఛ‌లోలో ఎలా ఉన్నాడో దాని సీక్వెల్ లా రొటీన్ గా క‌నిపించాడు.. కాష్మీర్ ప‌ర్దేశీ, యామిని భాస్క‌ర్ లు అప్పుడ‌ప్పుడూ పాట‌ల్లో క‌నిపించ‌డం త‌ప్ప బ‌య‌ట పెద్ద‌గా వాళ్ల‌కు చెప్పుకోద‌గ్గ పాత్ర‌లు ప‌డ‌లేదు. న‌ట‌న కూడా అంతంత‌మాత్ర‌మే. అజ‌య్ గే కామెడీ బాగానే చేసాడు. కానీ క‌థ స‌హ‌క‌రించ‌లేదు. ఉన్నంతలో జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, శివాజీరాజా సినిమాలో ఉన్న కామెడీని అంతా మోసారు. హీరో ఫ్రెండ్ కూడా బాగానే చేసాడు కానీ క‌థ‌లో కామెడీ త‌గ్గిపోవ‌డం ఒక్క‌టే సినిమాకు మైన‌స్ గా మారిపోయింది.

టెక్నిక‌ల్ టీం:
మ‌హ‌త్ సాగ‌ర్ ఛ‌లో త‌ర‌హాలో మ‌రోసారి మ్యాజిక్ చేయ‌లేక‌పోయాడు. అప్పుడు చూసి చూడంగానే పాట‌తో ఇండ‌స్ట్రీని ఊపేసి.. సినిమాకు హైప్ తీసుకొచ్చాడు కానీ ఇప్పుడు అది కుద‌ర్లేదు. ఇక్క‌డ ఒక్క పాట కూడా థియేట‌ర్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత గుర్తుండ‌దు. ఫ‌స్టాఫ్ అంతా బోర్ కొట్టించ‌డంతో ఎడిటింగ్ కూడా వీక్ అనిపించింది. సెకండాఫ్ లో అస‌లు క‌థ మొద‌లైన త‌ర్వాత కూడా ఆస‌క్తి పెంచ‌డంలో ద‌ర్శ‌కుడు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. రెండు గంట‌ల 20 నిమిషాల సినిమా ఉండ‌టంతో సాగ‌దీసిన‌ట్లు అనిపించింది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది.. సాయిశ్రీ‌రామ్ కెమెరా ప‌నిత‌నంతో సినిమా రిచ్ గా క‌నిపించింది. ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ చ‌క్ర‌వ‌ర్తి తొలి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.

చివ‌ర‌గా:
న‌ర్త‌న‌శాల‌.. అల‌రించ‌ని గే కామెడీ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *