నాని @ 10 ఇయ‌ర్స్.. ప‌దేళ్ల‌లో ఏమేం చేసాడు..?

రాంబాబు ఇక్క‌డ‌.. ఊరి పెద్ద‌.. ఏం చేసినా చెప్పినా వినాల్సిందే. నాకు ఎదురు చెప్పేవాళ్లెక్క‌డున్నారు అంటూ అష్టాచ‌మ్మాలో నాని చెప్పిన డైలాగ్స్ అంత ఈజీగా మ‌రిచిపోలేం క‌దా. అస‌లు అప్ప‌టి వ‌ర‌కు ఘంటా న‌వీన్ బాబుగా ఉన్న‌వాడు ఒక్క‌సారి నాని అయ్యాడు. ఈ సినిమా వ‌చ్చి.. నాని ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అప్పుడే ప‌దేళ్లైపోయింది. సెప్టెంబ‌ర్ 5, 2008న విడుద‌లైంది. క‌ల‌ర్స్ స్వాతి, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, త‌ణికెళ్ల భ‌ర‌ణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నాని హీరోగా వ‌చ్చింది ఈ చిత్రం. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌కుడు. సైలెంట్ గా ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రంతో నానికి న‌టుడిగా గుర్తింపు వ‌చ్చింది.
nani
ఆ త‌ర్వాత రెండు మూడేళ్ల పాటు చాలానే క‌ష్ట‌ప‌డ్డాడు నాని. రైడ్.. భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు లాంటి సినిమాలు ప‌ర్లేద‌నిపించినా కూడా క్రేజ్ అయితే తీసుకురాలేదు. కానీ అలా మొద‌లైందితో నాని జ‌ర్నీ కూడా అలాగే మొద‌లైంది. ఈ చిత్రం త‌ర్వాత వ‌చ్చిన పిల్ల‌జ‌మీందార్ కూడా హిట్ కావ‌డం.. ఆ వెంట‌నే రాజ‌మౌళి లాంటి స్టార్ డైరెక్ట‌ర్ వ‌చ్చి ఈగ సినిమా చేయ‌డంతో నాని రేంజ్ మారింది. అప్ప‌టి వ‌ర‌కు క్రేజీ హీరోగా ఉన్న నాని.. స్టార్ అయ్యాడు. ఈగ‌లో క‌నిపించేది కాసేపే అయినా ఇప్ప‌టికీ ఈగ అంటే నానినే గుర్తుకువ‌స్తాడు. ఈగ త‌ర్వాత గౌత‌మ్ మీన‌న్ ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు.. కృష్ణ‌వంశీ పైసా.. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ తొలి తెలుగు సినిమా ఆహాక‌ళ్యాణం.. స‌ముద్ర‌ఖ‌ని జెండా పై క‌పిరాజు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అలాంటి స‌మ‌యంలో వ‌చ్చిన ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం నాని కెరీర్ కు ఊపిరి పోసింది.
ఈ చిత్రం త‌ర్వాత నాని ఇంక వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. 2015లో భ‌లేభ‌లే మ‌గాడివోయ్.. 2016లో కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ.. జెంటిల్ మ‌న్.. మ‌జ్ను.. 2017లో నేనులోక‌ల్.. నిన్నుకోరి.. ఎంసిఏ ఇలా వ‌ర‌స విజ‌యాలు అందుకున్నాడు. 2018లో కృష్ణార్జున యుద్ధంతో మ‌ళ్లీ నాని జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం నాగార్జున‌తో దేవ‌దాస్ లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది. ఈ సినిమాతో పాటు జెర్సీ కూడా ఈయ‌నే చేస్తున్నాడు. మొత్తానికి ఈ ప‌దేళ్ల ప్ర‌యాణంలో చాలా రికార్డులు సాధించాడు నాని. సోలోగా వ‌చ్చి సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఎంద‌రో కొత్త వాళ్ల‌కు నాని ఆద‌ర్శంగా నిలిచాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here