పందానికి సిద్ధంగా ఉన్న కోడి..

సాధార‌ణంగా పందెంకోళ్లు అంటే సంక్రాంతికి వ‌స్తాయి. కానీ ఈ సారి మాత్రం విచిత్రంగా ద‌సరాకు వ‌చ్చేస్తుంది. అది కూడా విశాల్ రూపంలో. 14 ఏళ్ల కింద లింగుస్వామి తెర‌కెక్కించిన పందెంకోడితోనే ఈయ‌న స్టార్ అయ్యాడు. ఈ సినిమాతోనే తెలుగులోనూ జెండా పాతేసాడు ఈ హీరో. పైగా తెలుగ‌బ్బాయి కావ‌డంతో విశాల్ కు ఈ సెంటిమెంట్ కూడా ప‌ని చేసింది. మ‌నోడే అంటే ప్రేక్ష‌కులు ఈ హీరోను బాగానే ఆద‌రించారు. ఇక త‌మిళ్ వ‌ర్ష‌న్ సండేకోజి అయితే మ‌నోడి మార్కెట్ ను రెండింత‌లు చేసింది. పందెంకోడి త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.. ఆ అవ‌స‌రం కూడా రాలేదు ఈ హీరోకు.

pandem kodi 2

వ‌ర‌స విజ‌యాల‌తో అటూ ఇటూ స్టార్ అయిపోయాడు. ఈ మ‌ధ్య సినిమాల‌తో పాటు బ‌య‌ట చేస్తోన్న ప‌నులు కూడా విశాల్ ను రియ‌ల్ హీరోగా మార్చేస్తున్నాయి.క‌ష్టం ఎక్క‌డుంటే అక్క‌డ వాలిపోతున్నాడు విశాల్. దానికితోడు ఇండ‌స్ట్రీలో విజ‌యాలు కూడా వ‌స్తున్నాయి. ఈ ఏడాది అభిమ‌న్యుడుతో అటు ఇటు బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు విశాల్. దాంతో అదే న‌మ్మ‌కంతో ఇప్పుడు పందెంకోడి 2ను తెలుగు,త‌మిళ్ లో ఒకేరోజు విడుద‌ల చేస్తున్నాడు.

మ‌రికొన్ని గంట‌ల్లో అంటే అక్టోబ‌ర్ 18న సండెకోజి 2 రిలీజ్ కానుంది. తెలుగులో కూడా ఈ చిత్రం బిజినెస్ 6 కోట్ల వరకు జరిగిందని తెలుస్తుంది. అభిమన్యుడు 9 కోట్ల షేర్ తీసుకురావడంతో ఇప్పుడు ఈ చిత్రంపై కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు బయ్యర్లు. కీర్తిసురేష్ ఇందులో హీరోయిన్. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ఇందులో విల‌న్ గా న‌టించింది. ఈ చిత్రంలో మ‌రోసారి ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ గా న‌టించాడు విశాల్. హీరో తండ్రి పాత్ర‌లో రాజ్ కిర‌ణ్ కంటిన్యూ అయ్యాడు. మొత్తానికి అభిమ‌న్యుడు ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు రెండు భాష‌ల్లో ఒకేసారి వ‌స్తున్నాడు ఈ హీరో. మ‌రి చూడాలిక‌.. ఈయ‌న న‌మ్మ‌కం ఎంత వ‌ర‌కు నిల‌బ‌డుతుందో..? మ‌న బాక్సాఫీస్ ఎంత వ‌ర‌కు క‌దులుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here