వరస విజయాలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా.. రెండేళ్లుగా మళ్లీ గాడి తప్పాడు నిఖిల్. గతేడాది కేశవ జస్ట్ ఓకే అనిపించుకోగా.. కిరాక్ పార్టీ ఫ్లాప్ అయింది. దాంతో మళ్లీ హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు నిఖిల్. ప్రస్తుతం ఇదే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన తమిళ సినిమా కణితన్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఒరిజినల్ ను తెరకెక్కించిన టిఎన్ సంతోష్ తెలుగులోనూ దర్శకుడు.
ఈ చిత్రంలోని పూర్తి కథను కాకుండా.. కేవలం లైన్ మాత్రమే తీసుకుని ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కథను మార్చామని చెబుతున్నాడు నిఖిల్. అయితే దర్శకుడే ఇప్పుడు ఈ చిత్రానికి ఇబ్బందిగా మారినట్లు తెలుస్తుంది. సంతోష్ వల్లే సినిమా అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదు. పైగా సినిమా బిజినెస్ కూడా చాలా డల్ గా జరుగుతుంది. దానికి కారణం కూడా నిఖిల్ ప్రస్తుత ఫామ్. ఇలాంటి తరుణంలో దర్శకుడు కూడా ఆడుకోవడంతో ముద్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది.
ఇది ఫేక్ సర్టిఫికేట్ల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం వస్తుంది. అథర్వ నటించిన ఈ చిత్రం తమిళనాట మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. దాంతో పాటే డబ్బింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు దర్శకుడు సంతోష్. ముందు ఈ చిత్రాన్ని రవితేజతో రీమేక్ చేయాలని భావించినా తర్వాత నిఖిల్ వచ్చాడు ఈ ప్రాజెక్ట్ లోకి. షూటింగ్ చివరిదశకు వచ్చేసింది.
ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీనికి ముద్ర అనే టైటిల్ ఖరారు చేసారు. ఫేక్ సర్టిఫికేట్ ల నేపథ్యం కాబట్టి ముద్ర అనేది పర్ ఫెక్ట్ టైటిల్. ఆ మధ్య విడుదలైన లుక్ కూడా సినిమాపై ఆసక్తి పెంచేస్తుంది. లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్. షూటింగ్ స్టేజ్ లో ఉన్నపుడే ఈ ముద్ర శాటిలైట్ రైట్స్ ను ఓ లీడింగ్ ఛానెల్ 5.50 కోట్లకు దక్కించుకుంది. డిసెంబర్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. బడ్జెట్ కూడా 10 కోట్లలోపే ఉంది. అందులో సగం ఇప్పుడే వచ్చేసింది. మొత్తానికి ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు నిఖిల్