క‌ళ్యాణ్ రామ్ క‌న్నీరు పెట్టించాడుగా..

అరవింద సమేత వీరరాఘవ ప్రీ రిలీజ్ వేడుక కాస్తా నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ కార‌ణంగా చాలా ఎమోష‌న‌ల్ అయిపోయింది. గాంధీజ‌యంతి సంద‌ర్భంగా జ‌రిగిన ఈ వేడుక‌లో క‌ళ్యాణ్ రామ్ చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. ఆయ‌న మాట‌లు విన్న అభిమానులు కూడా కంట‌త‌డి పెట్టుకున్నారు. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత తొలిసారి బ‌య‌టికి వ‌చ్చారు ఈ సోద‌ర‌లిద్ద‌రూ. దాంతో అభిమానుల స‌మ‌క్షంలోనే త‌మ మ‌న‌సులో బాధను చెప్పుకున్నారు. ముఖ్యంగా క‌ళ్యాణ్ రామ్ చాలా హూందాగా మాట్లాడాడు.

KALYAN-RAM-SPEECH

నెల క్రితం ఒక సంఘటన జరిగింది. చాలామంది సినిమా విడుదల వాయిదా పడుతుందని అనుకున్నారు. ఇది గుర్తొచ్చినప్పుడల్లా మా నాన్నగారు చెప్పిన విషయం గుర్తొస్తోంది. 1962వ సంవత్సరంలో మేకప్‌ వేసుకుని షూటింగ్‌ వెళ్లిన మా తాతగారు, మన అన్నగారు నందమూరి తారక రామారావుగారు షూటింగ్‌లో ఉండగా, ఒక అశుభ వార్త వినాల్సి వచ్చింది. ఆయన పెద్ద కొడుకు నందమూరి రామకృష్ణగారు కన్నుమూశారని తెలిసింది. కొడుకు చనిపోతే ఏ తండ్రీ తట్టుకోలేడు. కానీ, ఆయన లొకేషన్‌లో ఉన్నారు. ఆ ప్రొడ్యూసర్‌కు నష్టం రాకూడదని, రోజంతా షూటింగ్‌ చేసి అప్పుడు వెళ్లారట. వృత్తిధర్మం అలాంటిది.. అని చెప్పాడు క‌ళ్యాణ్ రామ్.

ఇక 1976లో మా ముత్తాత ల‌క్ష్మ‌య్య చౌద‌రి గారు కూడా పొలం ప‌నులు చేసి వ‌స్తూ శంషాబాద్ ద‌గ్గ‌ర రోడ్డు ప్రమాదంలో కాలం చేశారు. అప్పుడు కూడా మా తాతగారు వృత్తికి ఇచ్చిన గౌరవంతో షూటింగ్‌ పూర్తి చేసే వెళ్లారు. 1982లో మా బాలయ్య బాబాయ్‌, రామకృష్ణ బాబాయ్‌ల పెళ్లిళ్లు వరుసగా జరిగాయి. మరో నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ ప్రచారంలో ఉండి పెళ్లికి కూడా రాలేదు. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలని అనుకున్నారు కాబట్టి. దాన్ని వృత్తిగా అనుకున్నారు కనుకే రాలేదు.
వాళ్ల‌ను చూసి మేం చాలా నేర్చుకున్నాం అని చెప్పాడు క‌ళ్యాణ్ రామ్. ఇక నెల రోజుల కింద అంటే ఆగ‌స్ట్ 29న మా ఇంట్లో మ‌రో విషాదం జ‌రిగింది. అప్ప‌టికి అరవింద సమేత 30 రోజుల షూటింగ్‌ మిగిలే ఉంది. అసలు సినిమా ఇప్పుడప్పుడే రిలీజ్‌ అవుతుందా అనుకుంటున్న స‌మ‌యంలో ఐదో రోజు ఎన్టీఆర్ షూటింగ్ కు వ‌చ్చాడ‌ని గుర్తు చేసుకున్నాడు క‌ళ్యాణ్ రామ్. మొత్తానికి ఈయ‌న స్పీచ్ అక్క‌డున్న వాళ్లంద‌రికీ కంట‌త‌డి పెట్టించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here