క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు@ 43 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ..

MohanBabu
ఒకటి రెండు కాదు.. ఏకంగా 43 ఏళ్ల ఇండ‌స్ట్రీ అంటే చిన్న విష‌యం కాదు. 10 ఏళ్లు ఇండ‌స్ట్రీలో ఉంటేనే అబ్బో అనుకుంటున్న రోజులివి. అలాంటిది ఏకంగా నాలుగు ద‌శాబ్ధాలకు పైగా ఇండ‌స్ట్రీలోనే ఉంటూ.. స్టార్ హీరోగా.. విల‌న్ గా.. న‌టుడిగా.. కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా.. నిర్మాత‌గా.. విద్యా వేత్త‌గా.. బిజినెస్ మ్యాన్ గా.. రాజ‌కీయ నాయ‌కుడిగా.. ఇలా ఒక్క‌టేంటి ఎన్నో విధాలుగా ప్ర‌జ‌ల ముందే ఉన్నాడు క‌లెక్షన్ కింగ్ మోహ‌న్ బాబు. ఈయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 2018, న‌వంబ‌ర్ 22తో 43 ఏళ్లు పూర్త‌య్యాయి. స‌రిగ్గా 43 ఏళ్ల కిందే ఇదే రోజు అంటే 1975, న‌వంబ‌ర్ 22న ఆయ‌న న‌టించిన స్వ‌ర్గం న‌ర‌కం విడుద‌లైంది. దాస‌రి నారాయ‌ణ‌రావు తెర‌కెక్కించిన ఈ చిత్రంతోనే న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ తొలి నాళ్ల‌లో హీరోతో పాటు విల‌న్ గానూ అల‌రించాడు మోహ‌న్ బాబు.
తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంత‌మంది విల‌న్లు అయినా ఉండొచ్చు కానీ మోహ‌న్ బాబు లాంటి విల‌న్ మాత్రం మ‌ళ్లీ రాడు.. లేడు.. రాబోడు. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే విల‌న్ కు కూడా ఓ స్టైల్.. మేన‌రిజ‌మ్స్ అల‌వాటు చేసిన న‌టుడు ఒక్క మోహ‌న్ బాబు మాత్ర‌మే. హీరో అయిన త‌ర్వాత ఈయ‌న విల‌నిజాన్ని చూసే భాగ్యం ప్రేక్ష‌కుల‌కు మిస్ అయిపోయింది. ఎన‌భైల్లోఏ సినిమా విడుద‌లైనా కూడా అందులో మోహ‌న్ బాబు క‌నిపించాల్సిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభ‌న్ బాబు, కృష్ణ‌, కృష్ణంరాజు నుంచి చిరంజీవి, బాల‌య్య‌, నాగార్జున‌, వెంక‌టేష్ వ‌ర‌కు అంద‌రితోనూ క‌లిసి న‌టించాడు మోహ‌న్ బాబు.
90ల్లో అల్లుడు గారు సినిమాతో మ‌ళ్లీ హీరో అయ్యాడు. అక్క‌డ్నుంచి సూప‌ర్ స్టార్ గా వెలిగిపోయాడు మోహ‌న్ బాబు. బ్ర‌హ్మ‌, పెద‌రాయుడు, అల్ల‌రి మొగుడు, అడ‌విలో అన్న లాంటి ఎన్నో సంచ‌ల‌న సినిమాల‌తో స‌త్తా చూపించారు. ఇండ‌స్ట్రీ హిట్లు కూడా అందుకున్నారు. ఈ మ‌ధ్యే గాయ‌త్రిలోనూ హీరో విల‌న్ గా ర‌ప్ఫాడించాడు క‌లెక్ష‌న్ కింగ్. ఒక‌ప్పుడు మోహ‌న్ బాబు సినిమా వ‌స్తుందంటే చాలా అంచ‌నాలుండేవి. కానీ కాలం మారిపోవ‌డంతో ఆయ‌న కూడా సినిమాలు త‌గ్గిస్తూ వ‌చ్చారు.
గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. అప్పుడెప్పుడో అల్ల‌రి న‌రేష్ తో ఓ సినిమా చేసిన మోహ‌న్ బాబు.. మొన్న గాయ‌త్రి అంటూ వ‌చ్చారు. ఇన్నేళ్ల కెరీర్ లో మోహ‌న్ బాబు చేసిన‌న్ని పాత్ర‌లు మ‌రే హీరో చేయ‌లేదు.. ఎన్టీఆర్ త‌ర్వాత ఆ స్థాయిలో తెలుగు డైలాగులు చెప్ప‌డంలో క‌లెక్ష‌న్ కింగ్ రూటే స‌ప‌రేటు. ఇన్నేళ్ల ప్ర‌యాణం ఇంకా ఎన్నోఏళ్లు కోరుకుంటూ 43 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు గారికి ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్ష‌లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here