ఎన్టీఆర్ ఏడిపించేసాడు బాబోయ్..

ముందు నుంచి అంతా అనుకుంటున్న‌దే.. అర‌వింద స‌మేత ప్రీ రిలీజ్ వేడుక‌లో కూడా అదే జ‌రిగింది. తండ్రి హ‌రికృష్ణ చ‌నిపోయిన నెల రోజుల త‌ర్వాత బ‌య‌టికి వ‌చ్చాడు ఎన్టీఆర్. వ‌చ్చీ రాగానే అభిమానుల‌ను చూసి ఉబికి వ‌స్తున్న దుఖాఃన్ని ఆపుకోలేక‌పోయాడు. అంద‌ర్నీ చూసి చిన్న పిల్లాడిలా ఏడ్చేసాడు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ తో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నాం కానీ కుదర్లేదని చెప్పాడు జూనియ‌ర్. నువ్వేనువ్వే నుంచి త్రివిక్ర‌మ్ త‌న‌కు తెలుసు అని.. క‌ష్టసుఖాలు మాట్లాడుకునేంత స్నేహితుడు అని.. కానీ ఎందుకో తెలియ‌దు కానీ ఇప్ప‌టి వ‌ర‌కు తాము సినిమా చేయ‌లేద‌ని చెప్పాడు ఎన్టీఆర్. అంతేకాదు.. త‌ను న‌టించిన 27 సినిమాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ తండ్రి చితికి నిప్పు పెట్టే సీన్ పెట్ట‌లేద‌ని.. ఎందుకో తెలియ‌దు కానీ ఈ సినిమాకే అది కుద‌రింద‌ని.. అదే క‌దా దైవ‌నిర్ణ‌యం అంటే అన్నాడు ఎన్టీఆర్. ఈ మాట విని అక్క‌డున్న వాళ్లంతా ఒక్క‌సారి ఎమోష‌న‌ల్ అయిపోయారు.

Ntr-Speech

త‌న తండ్రి చ‌నిపోయిన త‌ర్వాత ఈ నెల రోజుల నుంచి త‌న‌కు ఒక తండ్రిగా, స్నేహితుడిగా తోడు ఉన్నాడు త్రివిక్రమ్ ఉన్నాడని గుర్తు చేసుకుని బాధ ప‌డ్డాడు ఎన్టీఆర్. ఇంకా ఇదే వేడుక‌లో మాట్లాడుతూ.. నెల రోజుల నుంచి చాలా విష‌యాలు మ‌న‌సులో పెట్టుకుని ఉన్నాను. అంటే వాటిని ఎలా మాట్లాడాలో, ఎలా చెప్పాలో కూడా తెలియ‌దు. మేమిద్ద‌రం మాట్లాడ‌టం మానేసిన కార‌ణం ఏంటంటే.. ఇలాంటి విష‌యాల్లో మ‌నిషి బ‌తికున్న‌ప్పుడు విలువ తెలియ‌దు. మ‌నిషి పోయాక విలువ తెలుసుకోవాలంటే, మ‌నిషి మ‌న మ‌ధ్య ఉండ‌డు. త‌న తండ్రికి అంత‌క‌న్నా అద్భుత‌మైన కొడుకు ఉండ‌డు. కొడుక్కి అంత క‌న్నా అద్భుత‌మైన తండ్రి ఉండ‌డు. ఒక భార్య‌కి అంత‌క‌న్నా అద్భుత‌మైన భ‌ర్త ఉండ‌డు. మ‌న‌వ‌డికి, మ‌న‌వ‌రాలికి అంత‌క‌న్నా అద్భుత‌మైన తాత ఉండ‌డు అంటూ తండ్రిని గుర్తు చేసుకున్నాడు ఎన్టీఆర్.

బ్ర‌తికి ఉన్నంత వ‌ర‌కు ఎన్ని సార్లో నాకు, మా అన్న‌కు చెప్పాడో నాకు తెలుసు.. నాన్నా.. మ‌న‌మేదో చాలా గొప్ప‌వాళ్లం అని కాదు. ఒక మ‌హానుభావుడి క‌డుపున నేను పుట్టాను. నా క‌డుపున మీరు పుట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కు మ‌న‌ల్ని మోసుకెళ్లేది అభిమానులే. బ్ర‌తికున్నంత వ‌ర‌కు..` నాన్నా అభిమానులు జాగ్ర‌త్త‌. మ‌నం వాళ్ల‌కు ఏం చేయ‌క‌పోయినా.. వాళ్లు మ‌న‌కు ఏం చేస్తున్నారో.. నాకు తెలుసు. నాన్నా.. అభిమానులు జాగ్ర‌త్త ` అని చాలా సార్లు అనేవారు. ఈ ఒక్క సినిమాకు ఆయ‌న ఉండి ఉంటే బావుండేది. భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయినా, అభిమానులు అంద‌రి గుండెల్లో, అంద‌రి ముఖాల్లో ఆయ‌న్ని చూస్తున్నాను. మా నాన్న‌కి ఇచ్చిన మాట‌నే మీ అంద‌రికీ ఇస్తున్నాను ఈ రోజు. మా జీవితం మీకు (అభిమానుల‌కు) అంకితం అంటూ ఏడుస్తూ ప్ర‌సంగాన్ని ముగించాడు ఎన్టీఆర్. ఇంటికి జాగ్ర‌త్త‌గా వెళ్లండి అని ఎప్పుడూ చెప్పే మాట ముందు మ‌రిచిపోయినా.. వెంట‌నే వెన‌క్కి వ‌చ్చి నా తండ్రికి నేనెలాగూ చెప్ప‌లేక‌పోయాను మీకు చెప్తున్నా జాగ్ర‌త్త‌గా ఇంటికి వెళ్లండి.. మీ కోసం ఇంట్లో వేచి చూస్తుంటారు అని చెప్పాడు ఎన్టీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here