అల్లు అర్జున్ కాస్తా కేరళకు వెళ్లాడంటే మల్లు అర్జున్ అయిపోతాడు. ఆర్య నుంచి ఇప్పటి వరకు ఎందుకో తెలియదు కానీ మన హీరోకు అక్కడోళ్లు బాగా కనెక్ట్ అయిపోయారు. అక్కడి కుర్ర హీరోల కంటే ఒక్కోసారి మన బన్నీ సినిమాలు ఎక్కువ వసూళ్లు తెచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మన దగ్గర ఫ్లాప్ అయినా బద్రీనాథ్ లాంటి సినిమాలు కేరళలో సంచలనం సృష్టించాయి. ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు కేరళ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం అందుకున్నాడు బన్నీ. ఈయన్ని తమ రాష్ట్రానికి రావాల్సిందిగా అక్కడి ప్రభుత్వం కోరింది.. ప్రతీ ఏడాది అక్కడి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నెహ్రు ట్రోఫీ బోట్ గేమ్స్ కు ముఖ్య అతిథిగా వెళ్లాడు.
ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది అక్కడి ప్రభుత్వం. కేరళ ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానాన్ని మన్నించి బన్నీ కూడా సతీసమేతంగా కేరళ వెళ్లాడు బన్నీ. అక్కడి కొచ్చి ఎయిర్ పోర్ట్ లో దిగీ దిగగానే బన్నీకి ఊహించని స్వాగతం లభించింది. డప్పులు ఈలలు బ్యానర్లతో అల్లు అర్జున్ కు స్వాగతం కలిపారు. మల్లు అర్జున్ అంటూ ప్రేమగా పిలుచుకున్నారు. బన్నీ కూడా వాళ్ల ప్రేమ చూసి పొంగిపోతున్నాడు. నవంబర్ 10న జరిగే బోట్ పందేలను చూసి మళ్లీ హైదరాబాద్ రానున్నాడు బన్నీ. అల్లు అర్జున్ వస్తున్నాడని తెలుసుకుని అభిమానులు కూడా కొచ్చి ఎయిర్ పోర్ట్ బయట నానా రచ్చ చేసారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత మరే మరే సినిమాకు సైన్ చేయని అల్లు అర్జున్.. ఇలా హాయిగా కాలం గడిపేస్తున్నాడు. మొత్తానికి ఓ తెలుగు హీరోకు మళయాలంలో ఇంతగా ఆదరణ ఉండటం గొప్ప విషయమే కదా.