2.0.. ఒరిజిన‌ల్ టాక్ ఎలా ఉంది..?

2.0 సినిమా నిజంగానే అంత బాగా న‌చ్చిందా.. లేదంటే ఏదో మొహమాటినికి బాగుంద‌ని చెబుతున్నారా..? ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అడ‌గాల‌నిపిస్తుంది మ‌రి. ఎందుకంటే 2.0 సినిమా చూసిన త‌ర్వాత రియాక్ష‌న్స్ కాస్త ఆల‌స్యంగా బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఈ చిత్రంలో విజువ‌ల్ మాత్ర‌మే ఉంది.. విషయం ఎక్క‌డుంది అంటున్నారు ప్రేక్ష‌కులు. సినిమా చూసిన త‌ర్వాత ఆ మాయ‌లో మ‌త్తులో అదిరిపోయింది.. హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ వాడుకున్నాడు అంటూ చెప్పారు కానీ ఆ త‌ర్వాత మాత్రం విష‌యం లేదు గురూ అంటూ నిట్టూరుస్తున్నారు. సినిమాకు మూలంగా ఉండే ఎమోష‌న్స్ క‌థ‌లో ఎక్క‌డున్నాయి అని అడుగుతున్నారు.

2point0 First Day Public Talk

కేవ‌లం విజువ‌ల్ ఎఫెక్ట్స్ మాత్రమే న‌మ్మ‌కుంటే ప‌ని జ‌రుగుతుందా అని ప్ర‌శ్నిస్తున్నారు ఆడియ‌న్స్. దీనికి శంక‌ర్ అండ్ టీం నుంచి ఇప్పుడు స‌మాధానం శూన్య‌మే అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సినిమా విడుద‌లైన త‌ర్వాత కూడా ఇదే అనిపిస్తుంది అంద‌రికీ. క‌లెక్ష‌న్ల ప‌రంగా సినిమా రికార్డులు సృష్టించ‌వ‌చ్చు కానీ నిజంగా సినిమా బాగుందా అని త‌మ‌ను తాము ప్ర‌శ్నించుకుంటే మ‌న‌స్పూర్థిగా న‌చ్చింది అని చెప్ప‌లేని ప‌రిస్థితి. ర‌జినీకాంత్, అక్ష‌య్ కుమార్ లాంటి సూప‌ర్ స్టార్స్ ఉన్నా కూడా క‌థ కూడా ఉండాలి క‌దా.. అప్పుడే పెట్టిన 500 కోట్ల‌కు కాస్తైనా న్యాయం జ‌రుగుతుంది.. లేదంటే జ‌రిగే న‌ష్టం ఊహ‌కు కూడా అంద‌దు.

అయితే ఇప్పుడు శంక‌ర్ క‌ష్టాన్ని ఎవ‌రూ త‌క్కువ చేయ‌డం లేదు. ఆయ‌న మూడేళ్ల క‌ష్టం అద్భుతం. కానీ ఇదే పాత శంక‌ర్ అయ్యుంటే సినిమాలో గ్రాఫిక్స్ మాత్ర‌మే కాదు.. మ‌న‌సుకు హ‌త్తుకుపోయే క‌థ కూడా ఉండేది. కానీ ఇప్పుడు అది క‌నిపించ‌డం లేదు. హాలీవుడ్ మోజులో ప‌డి కేవ‌లం విజువ‌ల్ వండ‌ర్ మాత్ర‌మే తీసుకొచ్చాడు. మొబైల్స్ వాడ‌కం ప‌క్షుల‌కు ఎంత ప్ర‌మాదం అనేది క‌థ‌. అయితే సినిమాలో అక్ష‌య్ కుమార్ న‌ట‌న బాగుంది కానీ ఆయ‌న కారెక్ట‌ర్ డిజైనింగ్ లోనే చాలా అనుమానాలు వ‌స్తున్నాయి. అన్నీ విజువ‌ల్ తో క‌వ‌ర్ చేసినా కూడా లాజిక్స్ మాత్ర‌మే అలాగే ఉంటాయి క‌దా. ఇవ‌న్నీ చూసుకుంటే 2.0 స‌గ‌మే న‌చ్చింది.. మిగిలిన స‌గం క‌థ కూడా ఉండుంటే న‌చ్చేది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *