సూపర్ స్టార్ కృష్ణకు ‘ఆట’ జీవన సాఫల్య పురస్కారం డిసెంబర్ 23న ప్రదానం!!

Superstar Krishna to be honored with 'ATA' Lifetime achievement award
అమెరికాలో స్థిరపడిన తెలుగువారు 26 ఏళ్ళ క్రితం స్థాపించుకున్న సంస్థ ‘ఆట’ (అమెరికన్ తెలుగు అసోసియేషన్). మాతృభూమి రుణం తీర్చుకునేందుకు ప్రతి రెండేళ్ళకొకమారు ఇండియా వచ్చి’ఆట వేడుకలు’ పేరుతొ  పలు ఉపయోగవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుండే ఈ ప్రతిష్టాత్మక సంస్థ.. ఈ పర్యాయం కూడా తెలుగు నేలకు వచ్చి పలు అంశాలపై అవగాహనా సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు వంటి పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. నవంబర్ 26 నుంచి నిరాటంకంగా జరుగుతున్నఈ వేడుకలు డిసెంబర్ 23న ముగియనున్నాయి. ఆరోజు ఉదయం 5కె రన్ తో మొదలయ్యే ఈ ముగింపు ఉత్సవంలో సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. పలువురు ప్రముఖులు పాల్గొనే ఈ ఉత్సవంలో సుప్రసిద్ధ నటులు సూపర్ స్టార్ కృష్ణకు ‘ఆట జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నామని ‘ఆట’ ప్రస్తుత అధ్యక్షులు కరుణాకర్ అసిరెడ్డి, కాబోయే అధ్యక్షులు (ప్రెసిడెంట్ ఎలెక్ట్) పరమేష్ భీమిరెడ్డి ప్రకటించారు. అమెరికాలో స్థిరపడిన మన తెలుగువారి పిల్లలు- మన మూలాలు, మన భాష, మన సంస్కృతీసంప్రదాయాలు మర్చిపోకూడదనే ఉద్దేశ్యంతో రెండున్నర  దశాబ్దాల క్రితం చిన్న మొలకలా మొదలైన ‘ఆట’ నేడు మహా వృక్షంలా ఎదిగిందని.. చివరికి ఇదే పేరుతొ కొన్ని డూప్లికేట్ సంస్థలు కూడా పుట్టుకొచ్చాయని ‘ఆట’ ప్రస్తుత అధ్యక్షులు కరుణాకర్ అసిరెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ పరమేష్ భీమిరెడ్డి అన్నారు. అమెరికాలో ఉన్న తెలుగువారికే  కాకుండా.. ఇండియాలో ఉన్న మన తెలుగువారి కోసం సైతం ‘ఆట’ ఇతోధికంగా పాడుపడుతోందని వారు తెలిపారు. డిసెంబర్ 23న జరిగే ఆట ముగింపు వేడుకలకు పలువురు లబ్ధ ప్రతిష్టులు హాజరు కానున్నారని.. అదే రోజు సూపర్ స్టార్ కృష్ణకు ‘ఆట లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు’ ప్రదానం చేయనున్నామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ‘ఆట’ గౌరవ సలహాదారు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఆట ఓవర్ సీస్ కోర్డినేటర్స్  లోహిత్, మధు సూధన్ కోడూరు, ఆట ఫౌండర్ మెంబర్ డాక్టర్ రంగారావు, బోర్డు మెంబెర్స్ అనిల్ బొద్దిరెడ్డి, భువనేశ్ బూజాల, డాక్టర్ సురేంద్రరెడ్డి పాల్గొన్నారు. ‘ఆట’ చేస్తున్న కార్యక్రమాలను వీరంతా వివరించారు. కొందరు వ్యక్తులు ‘ఆట’ పేరును అనుకరించడం సరికాదని వీరు హితవు పలికారు. కాగా  ‘ఆట’ చేస్తున్న సేవలను తమ్మారెడ్డి భరద్వాజ, లోహిత్ కొనియాడారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here