యన్.టి.ఆర్. బయోపిక్ లో కీలక పాత్రలో విలక్షణ నటుడు

దర్శకుడిగా క్రిష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత యన్.టి.ఆర్. బయోపిక్ పై అంచనాలు రెట్టింపయ్యాయనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ తన తండ్రి, మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన యన్.టి.ఆర్. పాత్రను పోషిస్తుండగా, ఇతర ప్రధాన పాత్రలకోసం ప్రముఖ నటులను ఎంపిక చేస్తున్నారు నిర్మాతలు. దగ్గుబాటి రానా చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించనున్నారు. తాజాగా చిత్ర నిర్మాతలు ఓ కీలక పాత్ర కోసం డా. మోహన్ బాబు ను సంప్రదించారని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే వచ్చిన మహానటిలో యస్.వి. రంగారావు పాత్రలో తన అద్భుత నటనతో అబ్బుర పరిచిన మోహన్ బాబు ఈ మధ్య కాలంలో చిత్రాల ఎంపిక విషయంలో కడు జాగ్రత్త వహిస్తున్నారు. అయితే బాలకృష్ణ స్వయంగా కోరగా మోహన్ బాబు యన్.టి.ఆర్ బయోపిక్ లో నటించేందుకు అంగీకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అంతే కాకుండా, మోహన్ బాబుకు యన్.టి.ఆర్ తో ఉన్న ప్రత్యేక అనుబంధం అందరికి తెలిసిందే. ఇద్దరు కలిసి నటించిన “మేజర్ చంద్రకాంత్” చిత్రం యన్.టి.ఆర్ 1994 లో మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడానికి దోహద పడిందని అంటుంటారు. యన్.టి.ఆర్ హయాంలో మోహన్ బాబు రాజ్యసభ సభ్యునిగా పని చేసారు కూడా. యన్.టి.ఆర్ బయోపిక్ తారాగణంలో మోహన్ బాబు చేరితే, చిత్రం పై ఆసక్తి మరింత పెరగడం ఖాయం. ఫిలిం నగర్ లో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న ఈ సమాచారాన్ని తెలుగోడు టీం విశ్వసనీయ వర్గాలను సంప్రదించి ద్రువీకరించుకొని మీకు ఎక్స్ క్లూజివ్ గా అందిస్తున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here