నాగ‌బాబుది కాన్ఫిడెన్సా.. ఓవ‌ర్ కాన్ఫిడెన్సా..?


ఏమో ఇప్పుడు ఈయ‌న మాట‌ల‌ను వింటుంటే ఇదే ప్ర‌శ్న అడ‌గాల‌నిపిస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై న‌మ్మ‌కం ఉండ‌టం.. ఆయ‌న గెలుస్తాడేమో అనుకోవ‌డం ఆశ కావ‌చ్చు.. వాళ్ల న‌మ్మ‌కం కావ‌చ్చు కానీ ఆయ‌న మాత్ర‌మే గెలుస్తాడు అని చెప్ప‌డం మాత్రం క‌చ్చితంగా అత్యాశే అవుతుందేమో..!
కాన్ఫిడెన్స్ కాస్తా ఓవ‌ర్ కాన్పిడెన్స్ గా మారుతుందేమో అనిపిస్తుంది అప్పుడ‌ప్పుడూ నాగ‌బాబు మాట‌లు వింటుంటే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ప‌నిత‌నాన్ని కూడా త‌క్కువ‌గా అంచ‌నా వేయాల్సిన అవ‌స‌రం లేదు.
గ‌త ఎన్నిక‌ల్లోనే ప‌వ‌ర్ స్టార్ ఎంత ప్రభావితం చేసాడో కూడా ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు దేశం పార్టీకి స‌పోర్ట్ గా నిలిచి గెలుపులో కీల‌క‌పాత్ర పోషించాడు. కానీ అది వేరు.. ఇప్పుడు ప‌రిస్థితులు వేరు.
ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కూడా కొన్ని ఇబ్బందులు వున్నాయి. ఆయ‌న‌పై ప్ర‌త్యేకంగా రాజ‌కీయ ప‌రంగా కొన్ని కుట్ర‌లు జ‌రుగుతున్నాయి అనేది మాత్రం వాస్త‌వం. అది ఈ మ‌ధ్య బ‌య‌ట‌పెడుతున్నాడు ప‌వ‌ర్ స్టార్. అయితే ఈ సారి ఎన్నిక‌ల్లో కూడా ప‌వ‌న్ ఇదే మ్యాజిక్ చేస్తాడా అనేది మాత్రం క‌చ్చితంగా అనుమాన‌మే. ఎందుకంటే ఎన్నిక‌ల్లో గెలిచి ముఖ్య‌మంత్రి అవ్వ‌డం అంటే భ‌ర‌త్ అనే నేనులో మ‌హేశ్ చేసినంత ఈజీ కాదు.
ఇది నిజంగా చేయాల్సిన ప‌ని. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన పార్టీ ఇంకా మొగ్గ ద‌శ‌లోనే ఉంది. పార్టీ పెట్టి నాలుగేళ్ళు అయినా కూడా ప‌వ‌న్ త‌ర్వాత సెకండ్ గ్రేడ్ లీడ‌ర్ లేని పార్టీ ఇది. పైగా క్యాడ‌ర్ ఎంత వ‌ర‌కు ఉందో కూడా ఎవ‌రికీ తెలియ‌దు. కేవ‌లం అభిమానుల‌నే న‌మ్ముకుని ముందుకు అడుగు వేయ‌లేదు.
అప్పట్లో చిరంజీవి కూడా అభిమానుల‌ను న‌మ్ముకుని పార్టీ పెట్టాడు. కానీ చివ‌రికి ప్ర‌జారాజ్యం ఎటూ కాకుండా పోయింది. అయితే ఇప్పుడు ప‌వ‌న్ ఏం చేస్తాడనేది మాత్రం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఇప్పుడు ప‌రిస్థితులేంటో తెలియ‌కుండా ప‌వ‌న్ ను ఎక్కువ‌గా ఊహించేసుకుని నాగ‌బాబు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మా త‌మ్ముడు వ‌స్తాడు.. దంచేస్తాడు.. పొడిచేస్తాడు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంద‌రి తాట తీస్తాడు అని ప్ర‌తిజ్ఞలు చేయ‌డం మాత్రం అంత మంచిది కాదంటున్నారు రాజ‌కీయ పండితులు. గెలిచే ప‌రిస్థితి ఉంటే ఎన్ని అన్నా ప‌ర్లేదు కానీ ఇప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్య‌లు మాత్రం మంచిది కాదేమో ప‌వ‌న్ రాజకీయ ప్ర‌స్థానానికి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here