క‌ర్త‌వ్యం సినిమా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20180316

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: క‌ర్త‌వ్యం
న‌టీన‌టులు: న‌య‌న‌తార‌, రామ‌చంద్ర‌న్ దొరైరాజ్, సునుల‌క్ష్మి, చిన్నారి మ‌హాల‌క్ష్మి త‌దిత‌రులు
సంగీతం: జిబ్ర‌న్
సినిమాటోగ్ర‌ఫీ: ఓం ప్ర‌కాశ్
నిర్మాత‌: శ‌ర‌త్ మ‌రార్
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: గోపీనైన‌ర్
న‌య‌న‌తార బొమ్మ వేస్తే తెలుగులోనూ ఆమె సినిమాలు ఆడ‌తాయి. మాయ లాంటి సినిమాలు తెలుగులోనూ మంచి విజ‌యం సాధించాయి. ఇప్పుడు క‌ర్త‌వ్యం కూడా ఇదే న‌మ్మ‌కంతో నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ తెలుగులో విడుద‌ల చేసారు. పైగా అర‌మ్ త‌మిళ్ లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. మ‌రి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఈ ఎమోష‌న‌ల్ డ్రామా ఎంత‌వ‌ర‌కు క‌నెక్ట్ చేసింది..?
క‌థ‌:
మ‌ధువ‌ర్షిణి(న‌య‌న‌తార‌) ఓ ఐఏఎస్ ఆఫీసర్. ఈమె ఉన్న జిల్లాలోనే వేనీడు అనే గ్రామంలో తాగునీరు కోసం క‌ష్టాలు ప‌డుతుంటారు ప్ర‌జ‌లు. వాళ్ల క‌ష్టాలు తీర్చ‌డానికి ప్ర‌భుత్వానికి సైతం ఎదురెళ్తుంది మ‌ధువ‌ర్షిణి. అదే ఊళ్లో బుల్ల‌బ్బాయి (రామ్స్), సుమతి(సునుల‌క్ష్మి) కూలిప‌ని చేస్తూ జీవ‌నం గడుపుతుంటారు. వాళ్ల‌కు ఇద్ద‌రు సంతానం. ఓ రోజు సుమ‌తి కూలి ప‌నిలో ఉన్న‌పుడు ఈమె కూతురు ధ‌న్షిక‌(మ‌హాల‌క్ష్మి) ఆడుతూ వెళ్లి ప‌క్క‌నే పొలంలో మూయ‌కుండా వ‌దిలేసిన బోరుబావిలో ప‌డుతుంది. ఆ విష‌యం క‌లెక్ట‌ర్ మ‌ధువ‌ర్షిణికి తెలిసి పాప ప్రాణం కాపాడ‌టం కోసం ప్ర‌భుత్వంతోనే ఫైట్ చేస్తుంది. అస‌లు చివ‌రికి ఆ పాప ప్రాణాల‌ను క‌లెక్ట‌ర్ కాపాడారా లేదా..? ఎలా కాపాడారు..? అనేది మిగిలిన క‌థ‌.
 
క‌థ‌నం:
ఓ మ‌నిషిని ఏడిపించడం చాలా క‌ష్టం.. మాట‌ల్లో చెప్ప‌లేని భావ‌మైతేనే క‌ళ్ల‌లో బ‌య‌టికి క‌నిపిస్తుంది. ఇక అంత‌టి ఎమోష‌న్ ఓ సినిమాలో చూపించ‌డం అంటే అరుదు. క‌ర్త‌వ్యంలో ఆ ఎమోష‌న్ క‌నిపించింది. సినిమా చూస్తున్న‌పుడు మ‌న‌కు తెలియ‌కుండానే.. క‌ళ్ళు మ‌న మాట విన‌కుండానే.. క‌థ‌లో లీన‌మై.. క‌న్నీరు బ‌య‌టికి వ‌చ్చేంత ఎమోష‌న్ లో క‌ర్త‌వ్యంలో ఉంది. బోరుబావిలో ప‌డ్డ చిన్నారి అంటూ మ‌నం నిత్యం టీవీల్లో చూస్తుంటాం. అయ్యో పాపం అనుకోవ‌డం త‌ప్ప ఇంకేం చేయ‌లేం. అలాంటి చిన్న పాయింట్ నే క‌ర్త‌వ్యంలో హృద్యంగా చూపించాడు ద‌ర్శ‌కుడు గోపీనైన‌ర్. అభం శుభం తెలియ‌ని చిన్నారి.. నోరుతెరుచుకుని ఉన్న బోరుబావిలో ప‌డితే.. ఆ చీక‌ట్లో చిన్నారి చూసే న‌ర‌కం.. బ‌య‌ట వాళ్ల త‌ల్లిదండ్రులు ప‌డే వేద‌న‌.. వేడుక చూసే ప్ర‌భుత్వం.. ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ‌త్వం.. అన్నింటినీ అద్భుతంగా మ‌న‌సుకు హ‌త్తుకునేలా ఆవిష్క‌రించాడు ద‌ర్శ‌కుడు.
ఫ‌స్టాఫ్ లో చాలా వ‌ర‌కు ప్ర‌భుత్వంపై సెటైర్లు గుప్పించాడు ద‌ర్శ‌కుడు గోపీ. పేదోళ్ల క‌ష్టం ఎలా ఉంటుంది.. వాళ్ల‌ను రాజ‌కీయ నాయ‌కులు ఎలా మోసం చేస్తున్నార‌నే విష‌యంపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేసాడు. ఒక్క‌సారి పాప బోరుబావిలో ప‌డిన త‌ర్వాత అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. వేల‌ మైళ్లు ఉన్న ఆకాశానికి రాకెట్లు పంపిస్తున్న మ‌న దేశం.. అడుగుల లోతులో బోరుబావిలో ప‌డిన చిన్నారుల్ని మాత్రం కాపాడ‌లేక‌పోతున్నాం.. ఇలాంటి ధౌర్భ‌గ్యాన్ని చూస్తూ ఏడ‌వ‌డం త‌ప్ప ఏం చేయ‌లేం అంటూ.. క‌ర్త‌వ్యంలో మ‌న‌కు తెలిసిన విష‌యాల‌నే మ‌న‌సుకు హ‌త్తుకునేలా చెప్పాడు గోపీనైన‌ర్. క‌థ‌ను ఓపెన్ చేసిన విధానంతోనే ద‌ర్శ‌కుడి ప్ర‌తిభేంటో అర్థ‌మైపోతుంది. క‌ర్త‌వ్యం రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాదు.. పాట‌లు.. కామెడీ ఉండ‌వు.. కాస్త ఆలోచన తెప్పించే క‌థ‌.. మ‌న‌సును క‌దిలించే ఎమోష‌న్ త‌ప్ప.
సెకండాఫ్ లో చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌కు ముందే అర్థ‌మైపోతుంది క‌థ ఎలా ఉండ‌బోతుంది అని..! కానీ దాన్ని కూడా హోల్డ్ చేసే విధంగా గోపీనైన‌ర్ స్క్రీన్ ప్లే అద్భుతంగా రాసుకున్నాడు. క్లైమాక్స్ వ‌ర‌కు కూడా క‌థ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించుకుండా న‌డిపించాడు. మ‌ధ్య‌లో వ‌చ్చే డిస్క‌ష‌న్స్ క‌థ‌కు అడ్డు ప‌డుతుంటాయి. అవి లేకుండా చూస్తే మాత్రం క‌ర్త‌వ్యం నిజంగా చాలా కాలం గుర్తుండిపోయే సినిమానే. మ‌న‌సును ఒక్క‌సారైనా క‌దిలించే సినిమానే. సినిమా మరీ బాగుంటే కూడా చూడ‌టం క‌ష్టం.. తెలియ‌కుండానే ఏడుపు వ‌చ్చేస్తుంటుంది. క‌ర్త‌వ్యంలో ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి ముఖ్యంగా పాప బోరుబావిలో ఉన్న‌పుడు త‌ల్లిదండ్రులు మాట్లాడే సీన్.. క్లైమాక్స్ లో పాప‌ను బ‌య‌టికి తీయ‌డానికి ప్ర‌య‌త్నించే స‌న్నివేశాలు గుండెను బ‌రువెక్కించ‌డం ఖాయం.
న‌టీన‌టులు:
ఫీమేల్ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌కు న‌య‌న‌తార కేరాఫ్ అడ్ర‌స్ అయిపోయింది. ఇలాంటి పాత్ర‌లు ఆమెకు కొట్టిన‌పిండి. ఇప్పుడు క‌ర్త‌వ్యంలో కూడా క‌లెక్ట‌ర్ పాత్ర‌లో జీవించింది. క‌లెక్ట‌ర్ మ‌ధువ‌ర్షిణిగా న‌య‌న్ ను త‌ప్ప మ‌రొక‌ర్ని ఊహించుకోవ‌డం సాధ్యం కాదు. ఇక పాప తండ్రిగా రామ్స్.. త‌ల్లిగా సునుల‌క్ష్మి చాలా బాగా న‌టించారు. బోరుబావిలో ప‌డే అమ్మాయి ధ‌న్షిక‌గా మ‌హాల‌క్ష్మి అద్భుతంగా న‌టించింది. మిగిలిన వాళ్ల పాత్ర‌ల‌న్నీ క‌థానుగుణంగా వ‌చ్చి వెళ్తుంటాయంతే.
టెక్నిక‌ల్ టీం:
క‌ర్త‌వ్యం సినిమాకు ప్రాణం సంగీతం. జిబ్ర‌న్ కు నూటికి నూరు మార్కులు ప‌డ‌తాయి. పాట ఒక్క‌టే ఉన్నా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతం. త‌న సంగీతంతో మ‌న‌సుల‌ను బ‌రువెక్కించేసాడు జిబ్ర‌న్. ఇక సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ముఖ్యంగా బోరుబావి సీన్స్ న్యాచుర‌ల్ గా వ‌చ్చాయి. ఎడిటింగ్ ప‌ర్లేదు. మ‌ధ్య‌లో త‌మ్మారెడ్డి, సుద్దాల అశోక్ తేజ‌తో వ‌చ్చే డిస్క‌ష‌న్ ను తీసేసిన ప‌ర్లేదేమో. క‌థ‌కు అడ్డుప‌డే సీక్వెన్స్ అది. డ‌బ్బింగ్ పై ఇంకాస్త శ్ర‌ద్ధ చూపించి ఉంటే బాగుండేది. క‌థ‌కుడిగా, ద‌ర్శ‌కుడిగా గోపీనైన‌ర్ ఎక్కువ మార్కులు కొట్టేసాడు. ఈయ‌న చెప్పిన తీరు అంద‌రికీ న‌చ్చ‌క‌పోవ‌చ్చు కానీ మ్యాగ్జిమ‌మ్ ప్రేక్ష‌కుల‌కు ఈ క‌ర్త‌వ్యం చేరువ కావ‌డం ఖాయం. క‌థ‌ను క‌థ‌గా చూపిస్తూనే ప్ర‌భుత్వంలో ఉన్న లోటుపాట్ల‌ను కూడా ఎత్తి చూపించాడు ద‌ర్శ‌కుడు.
చివ‌ర‌గా:
క‌ర్త‌వ్యం.. ఓ మంచి సినిమా.. ఆలోచింప‌జేసే ఓ మంచి సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here