విప్ల‌వ‌మే ఆయ‌న ఊపిరి..


సినిమా అంటే క‌మ‌ర్షియ‌ల్ హంగులు.. డ‌బ్బుల కోసం చేసే వ్యాపారం. కానీ కొంద‌రికి మాత్రం సినిమా అంటే సామాజిక మాధ్య‌మం.. దాని వ‌ల్ల జ‌నం ఏదో ఒక మంచి విషయం నేర్పించే ఆయుధం. ఒక సినిమా చేస్తే క‌చ్చితంగా స‌మాజానికి దాన్నుంచి మంచి జ‌ర‌గాలి అనుకుంటారు కొంద‌రు. ఆ కొంద‌రిలో మాదాల రంగారావు కూడా ఒక‌రు.
ఈయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ త‌రం న‌డుస్తుంది. అయినా కూడా వాళ్ల‌ను త‌ట్టుకుని మ‌రీ ఎర్ర సినిమాలు చేసి విజ‌యం సాధించారు. అంటే విప్ల‌వం వ‌ర్ధిల్లాలి అన్న‌మాట‌. తెలుగు సినిమా ఉన్నంత కాలం కూడా ఉండే సినిమాలు అవి. మాదాల రంగారావు చేసిన యువ‌త‌రం క‌దిలింది.. ఎర్ర‌మ‌ల్లెలు.. విప్లవశంఖం.. స్వరాజ్యం.. ఎర్ర సూర్యుడు.. ఎర్రపావురాలు.. జనం మనం.. ప్రజాశక్తి తదితర సినిమాలు అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి.
ఈయ‌న‌కి రెడ్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చాయి. నవతరం ప్రొడక్షన్స్‌ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి అందులోనూ మంచి సిన‌మాలు చేసారు ఈయ‌న‌. హీరో గోపీచంద్ తండ్రి, ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ.. నిర్మాత పోకూరి బాబూరావు ఈయన సహోధ్యాయులు. నవతరం ప్రొడక్షన్స్‌ పతాకంపై మాదాల రంగారావు 1980లో తీసిన యువతరం కదిలింది చిత్రానికి నంది పుర‌స్కారం కూడా వ‌చ్చింది. విప్లవ భావాలు క‌లిగిన మాదాల ఆ పంథాలోనే సినిమాలు చేసారు. తెలుగు సినిమా మారినా తాను మాత్రం మార‌లేదు. తుదిశ్వాస విడిచేవ‌ర‌కు కూడా త‌ను న‌మ్మిన దారిలోనే న‌డిచారు ఈ రెడ్ స్టార్. ఈయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుందాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here