రివ్యూ: కాశీ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: కాశీ
న‌టీన‌టులు: విజ‌య్ ఆంటోనీ, అంజ‌లి, శిల్పా మంజునాథ్, నాజ‌ర్ త‌దిత‌రులు
క‌థ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: కృతుంగ ఉద‌య‌నిధి
నిర్మాత‌: విజ‌య్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేష‌న్
సంగీతం: విజ‌య్ ఆంటోనీ
సంగీత ద‌ర్శ‌కుడిగా ఉన్న విజ‌య్ ఆంటోనీ మంచి క‌థ‌ల్ని ఎంచుకుంటూ హీరోగా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తెలుగులో కూడా ఈయ‌న స‌క్సెస్ అయ్యాడు. బిచ్చ‌గాడుతో స‌ర్ ప్రైజ్ హిట్ కొట్టి.. అప్ప‌ట్నుంచీ తెలుగు ఇండ‌స్ట్రీపై దండ‌యాత్ర చేస్తున్నాడు. మ‌ళ్లీ ఇప్పుడు కాశీ సినిమాతో వ‌చ్చాడు. మ‌రి ఈ సారి ఏం చేస్తున్నాడు..? ఈ హీరో మ‌రో హిట్ అందుకున్నాడా..?
క‌థ‌:
భ‌ర‌త్(విజ‌య్ ఆంటోనీ) చిన్న‌ప్ప‌ట్నుంచీ అమెరికాలోనే పెరుగుతాడు. అక్క‌డే డాక్ట‌ర్ అవుతాడు. త‌న‌ అమ్మానాన్న‌ల‌తో ఉంటాడు. కానీ ఓ రోజు స‌డ‌న్ గా తాను ఉంటున్న‌ది త‌న అస‌లైన త‌ల్లిదండ్రుల‌తో కాద‌ని.. పెంపుడు త‌ల్లిదండ్రులు అని తెలుసుకుంటాడు. ఆ క్ర‌మంలోనే త‌న అస‌లైన త‌ల్లి దండ్రుల్ని వెతుక్కోడానికి ఇండియా వ‌స్తాడు. అక్క‌డ త‌ల్లి దొరుకుతుంది కానీ తండ్రి దొర‌క‌డు. అస‌లు ఎవ‌రు తన తండ్రి.. ఎందుకు త‌న త‌ల్లిని మోసం చేసాడు అని క‌నుక్కునే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఈ క్ర‌మంలో అత‌డికి ఎదురైన అనుభ‌వాలే ఈ చిత్ర క‌థ‌..
క‌థ‌నం:
విజ‌య్ ఆంటోనీ సినిమా ఏదైనా అందులో అమ్మ సెంటిమెంట్ మాత్రం ఎక్కువ‌గా ఉంటుంది. బిచ్చ‌గాడు ఇదే క‌థ‌తో వ‌చ్చింది. ఇప్పుడు కాశీ కూడా అంతే. ఇందులో కూడా ఎక్కువ‌గా అమ్మ‌నే చూపించాడు ద‌ర్శ‌కుడు. చిన్న‌పుడే త‌ల్లిదండ్రుల నుంచి త‌ప్పిపోయిన ఓ బిడ్డ‌.. త‌న పేరెంట్స్ ను వెతుక్కుంటూ వెళ్ల‌డమే క‌థ‌. రెండే రెండు ముక్క‌ల్లో తేల్చేసే క‌థ‌ను అన‌వ‌స‌ర‌పు హంగుల‌తో రెండు గంట‌లు చేసాడు ద‌ర్శ‌కుడు. దానికోసం నానా తిప్ప‌లు ప‌డ్డాడు. అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌కుండా అడ్డొచ్చిన క‌థ‌ల‌న్నింటినీ చూపించాడు. ట్విస్టులు అనుకున్నాడు కానీ క‌థ గాడి తిప్పుతుంద‌నే విష‌యం గ్ర‌హించ‌లేక‌పోయాడు. అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌కుండా అడ్డొచ్చిన వాళ్లంద‌ర్నీ క‌థ‌లు చెప్ప‌డం.. అందులోకి హీరో పాత్ర‌ను దూర్చ‌డం.. ఇదే స‌రిపోయింది సినిమా అంతా. రెండు ముక్క‌ల్లో తేలిపోయే క‌థ‌ను రెండు గంట‌ల పాటు సాగించాడు ద‌ర్శ‌కుడు. చివ‌ర్లో క‌థ చెప్పిన త‌ర్వాత ప్రేక్ష‌కుడు కూడా ఇదే ఫీల్ అవుతాడు. ఏముంది సినిమాలో.. దీనికోస రెండు గంట‌లెందుకు సాగ‌దీయ‌డం అని..! ఫ‌స్టాఫ్ లో హీరో కాకుండా మ‌రో ప్రెసిడెంట్ ప్రేమ‌క‌థ‌.. సెకండాఫ్ లో ఓ దొంగ క‌థ‌.. రెండూ అస‌లు క‌థ‌కు అస్స‌లు సంబంధం లేని క‌థ‌లే. వాటిని తీసుకొచ్చి మెయిన్ క‌థ‌కు జోడించాడు ద‌ర్శ‌కుడు. అదెందుకో ఆయ‌న‌కే తెలియాలి మ‌రి..! ఇక అస‌లైన క‌థ చివ‌రి 15 నిమిషాల్లో చెప్తాడు. కానీ అప్ప‌టికే అంద‌రికీ ఆ క‌థేంటి అనేది అర్థ‌మైపోతుంది. అప్ప‌టికి చెప్పినా లాభం లేదు. మొత్తానికి విజ‌య్ ఆంటోనీ ఈ సారి మాత్రం పూర్తిగా మోస‌పోయాడు.. క‌థ లేని ఓ క‌థ‌ను ఎంచుకుని ఎటూ కాకుండా పోయాడు.
న‌టీన‌టులు:
విజ‌య్ ఆంటోనీ బాగానే చేసాడు. ఆయ‌న ఎప్పుడూ ఆర్ద్ర‌త‌తో కూడిన పాత్ర‌లే చేస్తుంటాడు. అమ్మ‌కు దూర‌మైన పాత్ర‌లు.. జీవితంలో ఓడిపోయిన పాత్ర‌లు.. ఇలాంటి సింప‌తీ వ‌చ్చే పాత్ర‌లే చేస్తుంటాడు. ఈ సారి కూడా ఇదే చేసాడు. అంజ‌లి ఎందుకు ఉందో ఆమెకే అర్థం కాదు. అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి మాయ‌మైపోతుంటుంది. మ‌రో హీరోయిన్ శిల్పా మంజునాథ్ పాత్ర కూడా అంతే. రెండు ల‌వ్ స్టోరీస్ కోసం ముగ్గురు హీరోయిన్ల‌ను తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. నాజ‌ర్, జ‌య‌ప్ర‌కాశ్ కూడా క‌థ‌లో అప్పుడ‌ప్పుడూ వ‌చ్చే పాత్ర‌లే.
టెక్నిక‌ల్ టీం:
విజ‌య్ ఆంటోనీ సంగీతం అర‌వ మేళంగా మారిపోయింది. ఒక్క పాట కూడా మ‌న ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డం క‌ష్ట‌మే. బ్యాగ్రౌండ్ స్కోర్ ప‌ర్లేదు. ఇక సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ఊళ్లోనే సినిమా తెర‌కెక్కించారు కాబ‌ట్టి పెద్ద‌గా చూపించ‌డానికి కూడా ఏం లేదు. ఎడిటింగ్ చాలా వీక్. చాలా సీన్లు క‌ట్ చేయొచ్చేమో అనిపించింది. రెండు గంట‌ల 14 నిమిషాల సినిమా కూడా మూడు గంట‌ల సినిమాలా సాగిపోయింది. ద‌ర్శ‌కుడు కృతుంగ ఉద‌య‌నిధి క‌థ ఎక్క‌డో మొద‌లుపెట్టి ఎక్క‌డో ఆపాడు. మ‌ధ్యలో ఇంకొన్ని క‌థ‌లు జోడించాడు. క‌న్ఫ్యూజ‌న్ లేకుండా చెప్పాడు కానీ క‌థ‌కు అక్క‌ర్లేని క‌థ‌ల‌న్నీ చూపించాడు. అదే అస‌లు బాధ‌.
చివ‌ర‌గా:
కాశీ.. అమ్మా మా నాన్న ఎక్క‌డా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here