మ‌ళ్లీ రావా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20171208

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: మ‌ళ్లీ రావా
న‌టీన‌టులు: సుమంత్, ఆకాంక్ష సింగ్, గౌత‌మ్ త‌దిత‌రులు
నిర్మాత‌: రాహుల్ యాదవ్ నక్క
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌కుడు: గౌత‌మ్ తిన్న‌నూరి

గోదావ‌రి, గౌరి, స‌త్యం లాంటి సినిమాల‌తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుమంత్. కానీ ఆ త‌ర్వాతే ఆ టెంపో కొన‌సాగించ‌లేక కెరీర్ లో వెన‌క‌బ‌డిపోయాడు. ఇప్పుడు ఈయ‌న నుంచి సినిమా వ‌స్తుందంటే ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోవ‌డం కూడా లేదు. ఇలాంటి టైమ్ లో మ‌ళ్లీరావా అంటూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు సుమంత్. మ‌రి ఈయ‌న ఆశ‌ల‌ను సినిమా నిల‌బెడుతుందా..?

క‌థ‌:
కార్తిక్(సుమంత్) రాజోలులో ఉంటాడు.. అక్క‌డే చ‌దువుతుంటాడు. ఫ్రెండ్ సుబ్బు(గౌత‌మ్) లోకంగా బ‌తుకుతున్న కార్తిక్ జీవితంలోకి అంజ‌లి (ఆకాంక్ష సింగ్) వ‌స్తుంది. ఉద్యోగ‌రీత్యా అంజ‌లి ఫ్యామిలీ అక్క‌డే సెటిల్ అయిపోవాల్సి వ‌స్తుంది. చూసిన క్ష‌ణం నుంచే ఇద్ద‌రూ ఒక‌ర్నొక‌రు ఇష్ట ప‌డ‌తారు. కానీ అనుకోని కార‌ణాల‌తో చిన్న‌పుడే విడిపోతారు కార్తిక్, అంజ‌లి. కొన్నేళ్ళ త‌ర్వాత కార్తిక్ ప‌ని చేస్తోన్న కంపెనీకే ప్రాజెక్ట్ మేనేజ‌ర్ గా వ‌స్తుంది అంజ‌లి. అక్క‌డే మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డుతుంది. తీరా పెళ్లి చేసుకుందాం అనే టైమ్ కు నో చెప్పి వెళ్లిపోతుంది. అస‌లు కార్తిక్, అంజ‌లి మ‌ధ్య ఏం జ‌రిగింది..? జీవితంలో రెండుసార్లు ఎందుకు వాళ్లు విడిపోతారు.. అస‌లు మ‌ళ్లీ క‌లిసారా లేదా అనేది క‌థ‌.

క‌థ‌నం:
కొన్ని సినిమాలు మ‌న‌కు తెలియ‌కుండానే న‌చ్చేస్తుంటాయి.. మ‌ళ్లీ రావా కూడా అలాగే అనిపించే క‌థే.  ఎలాంటి అంచ‌నాలు లేవు.. క‌నీసం ఈ చిత్రం బాగుంటుంద‌నే న‌మ్మ‌కం కూడా లేదు.. ఇలాంటి సినిమా వ‌స్తుంద‌నే విష‌య‌మే చాలా మందికి తెలియ‌దు కానీ చూసిన వాళ్ల‌కు మాత్రం షాక్ ఇస్తుంది మ‌ళ్లీ రావా. చూస్తూ చూస్తూ మెల్ల‌గా క‌థ‌లోకి వెళ్లిపోవ‌చ్చు. అలాంటి మ్యాజిక్ ఉంది ఈ క‌థ‌లో. తెలిసిన క‌థ‌నే అందంగా చెప్పాడు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి. సినిమా మ‌రీ నెమ్మ‌దిగా సాగుతుంది.. ఇదే పెద్ద మైన‌స్. ప్ర‌తీ సీన్ ను సున్నితంగా చెప్పే క్ర‌మంలో ఓ సెక్ష‌న్ ఆఫ్ ఆడియన్స్ కు మ‌ళ్లీ రావా పూర్తిగా దూర‌మైపోయింది. కానీ కొన్ని సీన్స్ లో ఎమోష‌న్ కూడా అదే స్థాయిలో పండింది. స్కూల్ ల‌వ్.. కెరీర్ టైమ్ లో ఉండే ల‌వ్.. మెచ్యూర్డ్ ల‌వ్.. జీవితంలో ఉన్న మూడు ద‌శ‌ల‌ను చాలా బాగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. 3 ఫేజెస్ ను చ‌క్క‌టి స్క్రీన్ ప్లేతో అల్లుకున్నాడు గౌత‌మ్ తిన్న‌నూరి.
అస‌లు స్కూల్ లోనే ప్రేమేంటి.. అంత చిన్న ఏజ్ లో ల‌వ్ ఏంటి అనుకున్న‌వాళ్ల‌కు.. 14 ఏళ్ల‌కే మ‌న‌కు క్రికెట్ అంటే ఇష్టం.. అమ్మంటే ఇష్టం.. ఫ్రెండ్ అంటే ఇష్టం తెలిసిన మ‌న‌కు.. ఓ అమ్మాయి అంటే ఎందుకు ఇష్టం ఉండ‌కూడ‌ద‌నే ప్ర‌శ్న వేసాడు ద‌ర్శ‌కుడు..? అంత మెచ్యూరిటీ ఈ క‌థ‌పై ఉంది ద‌ర్శ‌కుడికి. ఇలాంటి సినిమాల్లో క‌మ‌ర్షియాలిటీ కోసం వెతుక్కోవ‌డం క‌ష్ట‌మే. చిన్న‌పుడు స్కూల్ లోనే అమ్మాయిని చూడ‌టం.. ఆమెపై ఆక‌ర్ష‌ణ‌.. అది ప్రేమ అని తెలుసుకోలేని వ‌య‌సు.. అప్పుడు మ‌న‌సు ప‌డే వేద‌న‌.. పెద్ద‌ల‌కు తెలిస్తే వ‌చ్చే గొడ‌వ‌లు.. ఇదే మ‌ళ్లీరావా సినిమా క‌థ‌. దీన్నే అంద‌మైన క‌థ‌గా మ‌లుచుకున్నాడు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి. స్క్రీన్ ప్లే అందంగా రాసుకున్నాడు. తొలి సీన్ లోనే హీరోయిన్ పెళ్లికి నో చెప్ప‌డంతో క‌థ‌పై ఆస‌క్తి మొద‌ల‌వుతుంది.

అప్ప‌ట్నుంచీ 1999 రాజోలు స్కూల్ డేస్.. 2012 ఆఫీస్ క‌థ‌.. 2017 ఈ మూడు ఫేజ్ ల‌ను క‌లుపుకుంటూ చ‌క్క‌టి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఇప్పుడు జ‌రిగే ప్ర‌తీ సీన్ కు గ‌తంతో ముడిపెడుతూ క‌న్ఫ్యూజ్ కాకుండా క‌థ‌ను న‌డిపించాడు. క‌థ‌లో ఇదే ఆస‌క్తిక‌రంగా అనిపించే పాయింట్. ఈ క్ర‌మంలో సినిమా చాలా నెమ్మ‌దిగా సాగుతుంది. స్కూల్ సీన్స్ అన్నీ నీట్ గా రాసుకున్నాడు. అస‌లు సినిమాకు బేస్ పాయింటే అది. ఆ త‌ర్వాత సాఫ్ట్ వేర్ సీన్స్ అన్నీ ఫ‌న్నీగా వ‌చ్చాయి. ప్రాజెక్ట్ మేనేజ‌ర్ కామెడీ బాగుంటుంది. హీరో, హీరోయిన్లు విడిపోవ‌డానికి కార‌ణాలు కూడా న్యాచుర‌ల్ గా చూపించాడు ద‌ర్శ‌కుడు. లైఫ్ లో ప్ర‌తీ విష‌యం సీరియ‌స్ గానే ఉండాలి అనే సున్నిత‌మైన సందేశం కూడా క‌థ‌లో క‌నిపిస్తుంది. ఓవ‌రాల్ గా మ‌ళ్లీరావా.. మ‌ళ్లీమ‌ళ్లీ ఇది రానిరోజులా నెమ్మ‌దిగా మ‌న‌సును క‌దిలిస్తూ సా…గుతుంది.

నటీన‌టులు:
సుమంత్ కు చాలా రోజుల త‌ర్వాత మంచి సినిమా ప‌డింది. ఇందులో కారెక్ట‌ర్ కూడా మెచ్యూర్డ్ గా ఉంటుంది కాబ‌ట్టి సింపుల్ గా ఆ పాత్ర‌లోకి దూరిపోయాడు సుమంత్. ఇక హీరోయిన్ ఆకాంక్ష‌కు కారెక్ట‌ర్ బాగానే ఉన్నా.. ఆమె ఫేస్ లో ఎక్స్ ప్రెష‌న్స్ క‌నిపించ‌లేదు. చిన్న‌ప్ప‌టి జంట మాత్రం చాలా బాగా న‌టించారు. ముఖ్యంగా అమ్మాయి అయితే అద‌ర‌గొట్టేసింది. హీరో ఫ్రెండ్ గా గౌత‌మ్ బాగా న‌టించాడు. సాఫ్ట్ వేర్ ఫ్రెండ్స్ తో వ‌చ్చే సీన్స్ అన్నీ ఫ‌న్నీగా అనిపిస్తాయి. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నిక‌ల్ టీం:
మ‌ళ్లీరావాకు శ్ర‌వ‌ణ్ అందించిన సంగీతం ప్రాణం. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. పాట‌లు కూడా ఓకే. సిచ్యువేష‌న్స్ కు త‌గ్గ‌ట్లుగా వ‌చ్చాయి. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. వాళ్ల‌కు ఉన్న బ‌డ్జెట్ లో మంచి ఔట్ పుట్ ఇచ్చారు. ఎడిటింగ్ కు పేరు పెట్ట‌డానికేం లేదు. రెండు గంట‌ల సినిమానే కానీ అక్క‌డ‌క్క‌డా నెమ్మ‌దిగా సాగింది. ద‌ర్శ‌కుడు గౌత‌మ్ లో విష‌యం చాలా ఉంది. ముఖ్యంగా అత‌డిలోని ర‌చ‌యిత మ‌ళ్లీరావాలో బాగానే రెచ్చిపోయాడు. ప్రేమ‌.. పెళ్లి.. ఆక‌ర్ష‌ణ‌.. వీట‌న్నింటి మ‌ధ్య ఉండే సున్నిత‌మైన బంధాలు అన్నింటినీ చాలా బాగా చూపించాడు ద‌ర్శ‌కుడు.

చివ‌ర‌గా:
మ‌ళ్లీరావా.. మ‌న‌సును తాక‌వే మెల్ల‌గా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here