మారుతి గారు.. రివ్యూ రైట‌ర్లంటే ఎందుకండీ క‌క్ష్య..?

ఒక్క డైలాగ్ చాలు.. ఒకే ఒక్క‌టి.. ఉన్న ఇంప్రెష‌న్ పోగొట్ట‌డానికైనా.. కొత్త ఇమేజ్ తీసుకురావ‌డానికైనా..! ఇన్నాళ్లూ త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు మారుతి ఇప్పుడు ఒక్క సినిమాతో.. మొత్తం పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఈయ‌న‌పై సోష‌ల్ మీడియాలో సెటైర్ల వ‌ర్షం కురుస్తుంది. దానికి కార‌ణం శైల‌జారెడ్డి సినిమాకు టాక్ తేడాగా రావ‌డం కాదు.. అందులో ఆయ‌న ఒక్క డైలాగ్ తేడాగా పెట్ట‌డం. ఈ సినిమాలో ఓ స‌న్నివేశంలో రివ్యూ రైట‌ర్ల‌పై మ‌ళ్లీ విరుచుకుప‌డ్డాడు మారుతి. స‌మ‌యం సంద‌ర్భం చూసుకుని మ‌రీ కావాల‌నే వాళ్ల‌ను టార్గెట్ చేసాడు. మీడియా నాలెడ్జ్ నీకు ఎక్కువగా ఉందిరా.. వెళ్లి శుక్ర‌వారం ఐమాక్స్ లో సినిమాలు చేసి రివ్యూలు రాసుకుపో అంటూ రఘుబాబు అక్క‌డే ఉన్న మ‌రో క‌మెడియ‌న్ పై సెటైర్ వేస్తాడు.

maruthi-director
ఈ మ‌ధ్య సినిమా వాళ్లంతా క‌లిసి రివ్యూ రైట‌ర్ల‌ను త‌క్కువ‌గా చూడ‌టం ఫ్యాష‌న్ అయిపోయింది. మంచి సినిమాలు వ‌చ్చిన‌పుడు ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర‌కి వాటిని చేర్చ‌డానికి వార‌ధిగా వాడుకునేది రివ్యూ రైట‌ర్ల‌నే అనే విష‌యం వాళ్లు మ‌రిచిపోతున్నారు. కేరాఫ్ కంచ‌ర‌పాలెం అనే సినిమా గురించి ఈ రోజు ఇండ‌స్ట్రీ అంతా మాట్లాడుకుంటుందంటే రివ్యూల వ‌ల్ల కాదా..? ఈ సినిమాకు ఏ ఒక్క‌రు కూడా బాగోలేదు అనే మాటే రాయ‌లేదు. దానికి ముందు కూడా చాలా చిన్న సినిమాలకు పాజిటివ్ రివ్యూలు వ‌చ్చాయి. అంతెందుకు పెద్ద సినిమాలు అయిన రంగ‌స్థ‌లం.. మ‌హాన‌టి లాంటి వాటికి కూడా రివ్యూలు ఎంతో ఎంక‌రేజ్ చేసాయి.
ఇక ఇప్పుడు రివ్యూ రైట‌ర్ల‌పై సెటైర్లు వేసే స్థాయికి ఎదిగిపోయిన మారుతి గ‌త సినిమాలు మ‌హానుభావుడు.. భ‌లేభ‌లే మ‌గాడివోయ్ లాంటి రొటీన్ క‌థ‌ల‌కు కూడా కామెడీ బాగుంద‌ని ఎంకరేజ్ చేసింది కూడా రివ్యూ రైట‌ర్లే క‌దా. వాటిలో విష‌యం ఉన్న‌పుడు క‌చ్చితంగా రివ్యూలు పాజిటివ్ గానే వ‌స్తాయి. లేదంటే రావు.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మ‌న ద‌ర్శ‌కులు అనేది ఇప్ప‌టికీ అర్థం కాని విష‌యం. అది వ‌దిలేసి మేం తీసిన అద్భుత‌మైన క‌ళాఖండాల‌ను రివ్యూ రైట‌ర్లు వాళ్ల రాత‌ల‌తోనే చంపేస్తున్నారు అంటూ గ‌గ్గోలు పెట్ట‌డం ఏంటో మ‌రి ఎవ‌రికీ అంతు చిక్క‌ని విష‌యం. మ‌రి ఇప్ప‌టికైనా నిజం తెలుసుకుంటారో లేదంటే అక్క‌డే అదే భ్ర‌మలో ఉండిపోతారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here