చావ‌క‌ముందే చంపేస్తారా..?

Jayanthi
ఓ స‌గ‌టు ప్రేక్ష‌కుడి ప్ర‌శ్న ఇది. మీడియా చూపిస్తున్న అత్యుత్సాహానికి ఏమ‌నాలో తెలియ‌ని ఓ స‌గ‌టు ప్రేక్ష‌కుడి ప్ర‌శ్న ఇది. అప్ డేట్ పేరుతో ఏం చేస్తున్నారో కూడా తెలియ‌కుండా చేస్తోన్న మీడియాను చూసి క‌డుపు కాలి ఓ స‌గ‌టు ప్రేక్ష‌కుడి ప్ర‌శ్న ఇది. అస‌లు ఏం చేయాల్సిన మీడియా.. ఏం చేస్తుంది.. ఎందుకు ఇలా చేస్తుంది.. నిజాలు చెప్పాల్సిన వాళ్లే రేటింగ్ మోజులో ప‌డి ఎందుకు ఇంత‌గా దిగ‌జారిపోతున్నార‌ని చిరాకు వ‌చ్చి స‌గ‌టు ప్రేక్ష‌కుడు వేసిన ప్ర‌శ్న ఇది. ఓ మనిషిని బ‌తికున్న‌పుడే చంపేసేంత కుసంస్కారం ఎందుకు వ‌స్తుంది..? క‌నీసం ఆ మ‌నిషి చ‌నిపోయిందో బ‌తికిందో కూడా తెలుసుకోలేనంత తొంద‌ర‌పాటు.. బిత్త‌ర‌పాటు ఎందుకు..? ఒక్క‌సారి త‌ప్పు చేసిన త‌ర్వాత దాన్ని స‌రిదిద్దుకోగ‌ల‌మా..? ఎందుకు సెలెబ్రెటీల జీవితాల‌తో మీడియా ఇలా ఆడుకుంటుంది అని ఓ స‌గ‌టు ప్రేక్ష‌కుడు మండి అడుగుతున్న ప్ర‌శ్న ఇది.
దీనికి స‌మాధానం ఎవ‌రు చెప్తారు..? ఏ మీడియా ముందుకొచ్చి చెబుతుంది..? అవును.. మేం త‌ప్పు చేసాం అని ఒప్పుకునే వాళ్లున్నారా..? క‌నీసం మ‌నిషి చ‌చ్చిపోయే వ‌ర‌కు ఆగ‌లేని ఈ తొంద‌ర‌పాటు ఎందుకు..? బ‌తికున్న మ‌నిషిని చ‌చ్చిపోయింద‌ని బ్రేకింగ్ వేస్తే ఒక్క‌సారి ఆ ఫ్యామిలీ ప‌డే ఆవేద‌న ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదా..? అయినా కూడా మాకు ఎందుకు.. మా రేటింగ్ వ‌స్తే చాల‌ని ఊరికే ఉంటున్నారా..? ప‌్ర‌పంచం మొత్తం క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తోన్న స‌మ‌యంలో సీనియ‌ర్ న‌టీమ‌ణి జ‌యంతి క‌న్నుమూత అంటూ లీడింగ్ న్యూస్ ఛానెల్స్ కొన్ని బ్రేకింగ్స్ వేసాయి. మార్చ్ 27 రాత్రి ఇదే బిగ్ బ్రేకింగ్. కానీ పొద్దున్నే లేచి చూసేస‌రికి అంతా మాయం. సీన్ అంతా రివ‌ర్స్. ఆమె ఇంకా బ‌తికే ఉంది. చికిత్స‌కు స్పందిస్తుందంటూ డాక్ట‌ర్ల‌తో పాటు జ‌యంతి కుమారుడు కూడా మీడియాకు తెలిపాడు.
జ‌యంతి విష‌యంలో చేసిన త‌ప్పు ఎవరి నెత్తిమీద రుద్దాలిప్పుడు. డాక్ట‌ర్లు క‌న్ఫ‌ర్మ్ చేయ‌క‌ముందే వీళ్లే క‌న్ఫ‌ర్మ్ చేస్తున్నారా..? అన్నీ తెలుసు.. మాకు చెప్పేది ఎవ‌రు అని వాళ్ల‌కు వాళ్లే డెమీ గాడ్స్ లా ఫీల్ అవుతున్నారా అంటే మీడియాపై మండి ప‌డుతున్నారు ప్రేక్ష‌కులు.. వీక్ష‌కులు. ఇది తొలిసారి అయితే ఏమో అనుకోవ‌చ్చు. మూడేళ్ల కింద ఎమ్మెస్ నారాయ‌ణ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఆయ‌న చ‌నిపోక‌ముందే అన్ని లీడింగ్ ఛానెల్స్ ఆయ‌న ఫోటోకు దండేసాయి. ఆ బాధ‌తోనేమో మ‌రి.. ఒక్క‌రోజులోనే ఆయ‌న నిజంగానే చ‌నిపోయారు. దానికి ముందు కూడా ఇలా వ్యక్తి చ‌నిపోక ముందే చ‌నిపోయారు అంటూ మీడియాలో ప్ర‌సారం అవుతున్నాయి. నిజాలు చెప్పాల్సిన వాళ్లే ఇలా రేటింగులు కోసం తొంద‌ర‌ప‌డుతుంటే ఆ త‌ప్పు ఎవ‌రిద‌ని నిందించాలి..? ఇప్ప‌టికైనా ఈ దూకుడు కాస్త త‌గ్గితే మంచిది.. లేదంటే అన‌వ‌స‌రంగా ప్రేక్ష‌కుల చేతుల్లో మీడియా ప‌రువు పోతుంద‌ని స‌ల‌హాలు ఇస్తున్నారు కొంద‌రు విశ్లేష‌కులు. మ‌రి మ‌న మీడియా వాళ్ల‌కు ఇది ఎంత‌వ‌ర‌కు బుర్ర‌కెక్కుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here