కుర్రాడేంటి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు..

ఇప్పుడు నాగ‌శౌర్య‌ను చూసి ఇండ‌స్ట్రీలో కొందరు అడుగుతున్న ప్ర‌శ్న ఇదే. ఒక‌ప్పుడు త‌న సినిమా విడుద‌ల అవుతుందంటే టెన్ష‌న్ తో చ‌చ్చిపోయే ఈ హీరో.. ఇప్పుడు మాత్రం చాలా రిలాక్సింగ్ గా ఉన్నాడు. క‌చ్చితంగా హిట్ కొడ‌తా రాసి పెట్టుకోండి అంటున్నాడు. ఏదేమైనా ఇండ‌స్ట్రీలో హిట్ ఇచ్చే కిక్ ఇంకేదీ ఇవ్వ‌దు. ఇన్నాళ్లూ త‌న సినిమా ప్ర‌మోష‌న్స్ కు రావాలంటే కూడా అదోలా క‌నిపించే నాగ‌శౌర్య‌.. ఛ‌లో త‌ర్వాత ఎంత మారాడో చూడండి..? ఈయ‌న్ని చూస్తుంటే నిజంగా ఆ హీరో ఇత‌నేనా అనే అనుమానం వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఈయ‌న న‌ర్త‌న‌శాల సినిమాతో వ‌స్తున్నాడు.
NAGA SHOURYA in NARTHANASAHALA
శ్రీ‌నివాస్ చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. త‌న సొంత బ్యాన‌ర్ లోనే ఈ చిత్రం చేస్తున్నాడు ఈ హీరో. ఆగ‌స్ట్ 30న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ సినిమా గురించి పెద్ద‌గా ఏం చెప్ప‌లేదు కానీ ఒక్క‌మాట మాత్రం అనేసాడు. ఛ‌లో త‌ర్వాత వ‌స్తుంది క‌దా.. ఇది కూడా రాసిపెట్టుకోండి అంటూ ధైర్యంగా చెప్పేస్తున్నాడు. తాజాగా జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సినిమాపై చాలా న‌మ్మ‌కంగా ఉన్న‌ట్లు చెప్పాడు నాగ శౌర్య‌. ఒక్క‌సారి గెలుపు రుచికి అల‌వాటు ప‌డిన త‌ర్వాత వెన‌క్కి రావ‌డం క‌ష్టం.
ఆగ‌స్ట్ 31న రావాల్సిన శైల‌జారెడ్డి అల్లుడు కూడా వాయిదా ప‌డ‌టంతో ఇప్పుడు సోలోగా బాక్సాఫీస్ ను కుమ్మేయ‌డానికి సిద్ధం అవుతున్నాడు నాగ‌శౌర్య‌. ఓపెనింగ్స్ విష‌యంలో నాగ‌శౌర్య సినిమాలు చేసిందేం లేదు. పాజిటివ్ టాక్ వ‌చ్చిన త‌ర్వాతే క‌లెక్షన్లు వ‌చ్చేవి. కానీ ఇప్పుడు న‌ర్త‌న‌శాల విష‌యంలో మాత్రం తొలిరోజు నుంచే ఆ సంద‌డి క‌నిపించ‌నుంది. ఛ‌లో ఎఫెక్ట్ అది. పైగా సొంత బ్యాన‌ర్ లోనే వ‌స్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఆ మాత్రం ఉంటాయి. బ‌య‌టి బ్యాన‌ర్స్ లో చేయ‌డం వ‌ల్ల త‌న సినిమాలు స‌రైన ప్ర‌మోష‌న్ లేక పోయాయంటున్నాడు శౌర్య‌. ఆ మ‌ధ్య వ‌చ్చిన జాదూగాడు.. క‌ళ్యాణ వైభోగ‌మే లాంటి సినిమాలు పోవ‌డానికి కార‌ణాలు స‌రైన టైమ్ లో రిలీజ్ కాక‌పోవ‌డ‌మే అంటున్నాడు శౌర్య‌. అందుకే సొంతబ్యాన‌ర్ లోనే వ‌ర‌స‌ సినిమాలు చేయ‌డానికి  ఆస‌క్తి చూపిస్తున్నాడు ఈ హీరో. మొత్తానికి మ‌రి ఛ‌లోతో వ‌చ్చిన స‌క్సెస్ ను నర్త‌న‌శాల‌తో కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here