అప్ప‌ట్లో ప‌టాస్.. ఇప్పుడు ఛ‌లో.. 

 
ఈ రెండు సినిమాల‌కు పోలిక ఏంటి అనుకుంటున్నారా..? ఉంది.. క‌చ్చితంగా ఉంది.. కాస్త ఆలోచిస్తే రెండు సినిమాల్లో కొన్ని పోలిక‌లు క‌నిపిస్తాయి. ముందుగా రెండూ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్లే. ఫ‌స్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వ‌ర‌కు పూర్తిగా కామెడీ బేస్ మీదే న‌డిచే సినిమాలు ఈ రెండు. పైగా పాత రొటీన్ రొడ్డ కొట్టుడు క‌థ‌లు ఈ రెండు. కానీ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్ట‌ని విధంగా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కులు. అప్పుడు పాత క‌థ‌తో అనిలో రావి పూడి మాయ చేస్తే.. ఇప్పుడు ఛ‌లోతో వెంకీ కుడుముల ఇదే చేసాడు. ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్ళిపోతుంది. ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోల‌కు హిట్ రావ‌డం ఆల‌స్యం అవుతుందేమో కానీ రావ‌డం మాత్రం ప‌క్కా. నాగ‌శౌర్య‌కు ఆ టైమ్ ఇప్పుడు వ‌చ్చేసింది. కెరీర్ మొద‌ట్లో కొన్ని విజ‌యాలు ప‌ల‌కరించినా కూడా కుర్రాడు నిల‌బ‌డే హిట్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు రాలేద‌నే చెప్పాలి.
ఇప్పుడు ఛ‌లో రూపంలో ఆ విజ‌యం అందుకున్నాడు నాగ‌శౌర్య‌. లాజిక్కులు లేని మ్యాజిక్కులా కామెడీ ఇందులో బాగా వ‌ర్క‌వుట్ అయింది. దాంతో ప్రేక్ష‌కులు కూడా ప‌డి ప‌డి న‌వ్వుకుంటున్నారు థియేట‌ర్స్ లో. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో ఛ‌లో హవా బాగా క‌నిపిస్తుంది. ఇక ఓవ‌ర్సీస్ లో అయితే ఏకంగా ర‌వితేజ ట‌చ్ చేసి చూడును పూర్తిగా డామినేట్ చేస్తుంది ఈ చిత్రం. ఇప్ప‌టికే అక్క‌డ 90 ల‌క్ష‌లు ఛ‌లో ఖాతాలో ప‌డ‌గా.. ట‌చ్ చేసి చూడు లెక్క మాత్రం ఇంకా 60 ల్లోనే ఉంది. ఛ‌లో దూకుడు ఇలాగే కొన‌సాగేలా క‌నిపిస్తుంది. చూస్తుంటే అక్క‌డ ఛ‌లో ఈజీగా హాఫ్ మిలియ‌న్ అందుకునేలా  క‌నిపిస్తుంది. ఇదే జ‌రిగితే నాగ‌శౌర్య‌కు చాలా పెద్ద విజ‌యం వ‌చ్చిన‌ట్లే..! మొత్తానికి ఇంటా బ‌య‌టా క‌లిపి ఈజీగా ఛ‌లో 10 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేయ‌డం ఖాయ‌మైపోయింది. ఈ చిత్రానికి నిర్మాత కూడా నాగ‌శౌర్య‌. వాళ్ల అమ్మ ఉషా మ‌ల్పూరి ఛ‌లో చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు త‌న‌యుడికి వ‌చ్చిన తొలి విజ‌యాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారు ఉష‌. మొత్తానికి నాగ‌శౌర్య ఇన్నాళ్ల‌కు జ‌న్యూన్ హిట్ కొట్టి గాల్లో తేలిపోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here